కరోనా నేపథ్యంలో భారత్ నుంచి రాకపోకలపై మరో దేశం నిషేధాన్ని పొడిగించింది. భారత్‌లో వెలుగు చూసిన డెల్టా వేరియంట్ అత్యంత వేగంగా వ్యాపిస్తుండటంతో ఇప్పటికే చాలా దేశాలు భారత విమానాలపై బ్యాన్ విధిస్తున్నాయి. ఇప్పటికే ఈ వేరియంట్ ప్రపంచంలో చాలా దేశాల్లో వ్యాపించింది. ప్రపంచ ఆరోగ్య సంస్థ కూడా ఈ వేరియంట్‌పై ఆందోళన వ్యక్తం చేసిన సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలోనే ఫీలిప్పైన్స్ తాజాగా భారత్ నుంచి రాకపోకలపై నిషేధాన్ని జూలై 15 వరకు పొడిగిస్తున్నట్లు ప్రకటించింది. భారత్ సహా పాకిస్థాన్, శ్రీలంక, బంగ్లాదేశ్, నేపాల్, ఒమన్, యూఏఈ దేశాలపై కూడా ఈ నిషేధ ఆంక్షలు అమలులో ఉంటాయని ఆ దేశ ప్రెసిడెన్షియల్ స్పోక్స్‌పర్సన్ హ్యారీ రోక్యూ వెల్లడించారు. శరవేగంగా వ్యాప్తిచెందుతున్న కరోనా డెల్టా వేరియంట్ నేపథ్యంలోనే ఈ నిర్ణయం తీసుకున్నట్లు తెలిపారు. ఇప్పటివరకు దేశవ్యాప్తంగా 17 డెల్టా కేసులు గుర్తించినట్లు ఫీలిప్పైన్స్ ఆరోగ్యశాఖ వెల్లడించింది. ఇదిలాఉంటే.. ఫీలిప్పైన్స్‌లో కూడా స్వైరవిహారం చేసిన కరోనా ఇప్పటికే 24,557 మందిని పొట్టనబెట్టుకుంది. 1,408,058 మందికి ప్రబలింది.