‘తెర మీదనే మేం హీరోలం.. కానీ, మా నిజమైన హీరోలంటే పోలీసులే’ అని అర్జున్‌రెడ్డి ఫేం విజయ్ దేవరకొండ అన్నారు. శనివారం ఆయన లక్డీకాపూల్‌లోని డీజీపీ కార్యాలయానికి వెళ్లారు. అక్కడ కోవిడ్ కంట్రోల్ రూమ్‌ను సందర్శించారు. ఈ సందర్భంగా విజయ్ మాట్లాడుతూ ‘తెలంగాణ పోలీసులకు తెలుగు సినీపరిశ్రమ తరపున ధన్యవాదాలు తెలుపుతున్నాను. మా ఇండస్ట్రీ మొత్తం మీ వెనకాలే ఉంది. అత్యవసర సేవలకు ఎక్కడా అంతరాయం కలగకుండా, శాంతి భద్రతలు కాపాడుతూ, కరోనా వైరస్ చైన్‌ను అడ్డుకునేందుకు పోలీసులు కృషి చేస్తున్నారు. మేం తెరమీద మాత్రమే హీరోలం. కానీ, మీరే మా నిజమైన హీరోలు. గత 20 రోజులుగా మీరు లాక్‌డౌన్ కోసం శ్రమిస్తున్నారు. మా సపోర్ట్ మీకెప్పుడూ ఉంటుంది’ అని అన్నారు. అనంతరం విజయ్ దేవరకొండకు డీజీపీ మహేందర్‌రెడ్డి కృతజ్ఞతలు తెలిపారు.