ఏపీ లిక్కర్ స్కామ్ కొత్త విషయాలు బయటకు వస్తున్నాయా? సిట్ విచారణలో రాజ్ కసిరెడ్డి ఏం చెప్పాడు? ఈ వ్యవహారమంతా విజయసాయిరెడ్డిపై నెట్టేశారా? ఆయన ఇచ్చిన సమాచారంతో మరికొందరికి నోటీసులు పంపాలని భావిస్తున్నారా? విజయసాయిరెడ్డికి సిట్ నుంచి మళ్లీ పిలుపు వస్తుందా? ఈ కేసులో తీగలాగితే డొంక కదులుతోందా? అవుననే సంకేతాలు బలంగా వినిపిస్తున్నాయి.
జగన్ ప్రభుత్వంలో మద్యంలో వేల కోట్ల కుంభకోణం జరిగింది కూటమి ప్రభుత్వం ప్రధాన ఆరోపణ. గడిచిన ఆరు నెలలుగా విచారణ చేస్తోంది. అయితే సోమవారం సాయంత్రం హైదరాబాద్ ఎయిర్‌పోర్టులో కసిరెడ్డిని పోలీసులు అరెస్ట్ చేశారు. దీంతో ఈ కేసు వ్యవహారం మరో మలుపు తిరిగింది. లిక్కర్ వ్యవహారంలో కీలకంగా వ్యవహరించిన అప్పటి వైసీపీ నేతలు, కొందరు అధికారుల గుండెల్లో రైళ్లు పరుగెడుతున్నాయి. ఈ వ్యవహారం తమ మెడకు చుట్టుకుంటుదేమోనని బెంబేలెత్తుతున్నారు.