విశాఖలో జీవీఎంసీ మేయర్ వ్యవహారం హీట్ రేపుతోంది. ఇవాళ గ్రేటర్ విశాఖ మేయర్ పీఠం అవిశ్వాసంపై ఓటింగ్ జరగనుంది. జీవీఎంసీ ఇన్‌చార్జి కమిషనర్, జిల్లా కలెక్టర్ ఎం.ఎన్.హరేంధిరప్రసాద్ అధ్యక్షతన జరిగే ఈ సమావేశానికి అధికారులు అన్ని ఏర్పాట్లు పూర్తిచేశారు. మ్యాజిగ్ ఫిగర్ కోసం పార్టీలు ఊగిసలాడుతున్నాయి. అధికార, విపక్ష పార్టీల నేతలకు టెన్షన్ పెరిగిపోతుంది. దీంతో విశాఖ జీవీఎంసీలో క్షణక్షణం రాజకీయం మారుతుంది. అవిశ్వాస తీర్మానం నేపథ్యంలో వైసీపీ రాజీనామాల పర్వం కంటిన్యూ అవుతోంది. దీంతో అవిశ్వాస తీర్మానం నెగ్గుతామనే ధీమాలో కూటమి నేతలు ఉన్నారు. మరోవైపు అవిశ్వాస తీర్మానం వీగేలా చేసేందుకు వైసీపీ ప్రయత్నాలు చేస్తోంది. అయితే మేయర్ పీఠం చేజారితే వైసీపీ నెక్స్ట్ స్టెప్ ఏంటీ? అన్నది ఉత్కంఠగా మారింది.
మరోవైపు ఇవాళ క్యాంప్ నుంచి విశాఖకు కార్పొరేటర్లు రానున్నారు. అవిశ్వాస ఏర్పాట్లను అధికారులు పరిశీలించారు. గుర్తింపు కార్డుతో ఓటింగ్‌కి రావాలని సూచిస్తున్నారు. ఉదయం 11 గంటలకు అవిశ్వాసంపై ఓటింగ్ మొదలు కానుంది. 300 మంది పోలీసులతో భారీ భద్రత ఏర్పాటు చేశారు. మరోవైపు.. కూటమి నేతలు మాత్రం జీవీఎంసీ మేయర్ పీఠాన్ని గెలిచి.. రాబోయే స్థానిక సంస్థల ఎన్నికలకు ధీమాగా వెళతామని చెబుతున్నారు. ఈ పరిస్థితుల్లో.. జీవీఎంసీ మేయర్ పీఠాన్ని ఏ పార్టీ దక్కించుకుంటుందనే దానిపై.. విశాఖ ప్రజలు ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు.
ఇప్పటికే కూటమి కార్పొరేటర్లు మలేషియా నుంచి నగరానికి చేరుకున్నారు. అయితే వైసీపీ కార్పొరేటర్లు మాత్రం కేరళ, శ్రీలంకలోనే ఉండిపోయారు. అవిశ్వాస తీర్మానం నెగ్గేందుకు 74 మంది సభ్యుల మద్దతు అవసరం కాగా..ప్రస్తుతం కూటమికి 75 మంది మద్దతు ఉంది. వైసీపీకి 30 మంది కార్పొరేటర్ల మద్దతు ఉంది. వైసీపీ నుంచి మరో ఇద్దరిని తీసుకొచ్చేందుకు కూటమి ప్రయత్నిస్తున్నట్లు తెలుస్తోంది. ఇది ఇలా ఉంటే కూటమిలో ఉన్న కార్పొరేటర్లకు వైసీపీ గాలం వేస్తోంది.మొత్తానికి చివరి క్షణంలో ఏదైనా జరిగే అవకాశం ఉండటంతో..ఫలితంపై ఇరువర్గాల్లోనూ టెన్షన్ నెలకొంది.
విశాఖ మేయర్‌పై అవిశ్వాస తీర్మానంపై ఓటింగ్‌కు ముందు కొత్త ట్విస్ట్. తమ కార్పొరేటర్లను టీడీపీ నేతలు బెదిరించారంటూ… వైసీపీ, ఓ వీడియో రిలీజ్ చేసింది. కేరళలో తమ కార్పొరేటర్లు ఉన్న రిసార్ట్‌కు అర్ధరాత్రి టీడీపీ నేతలు వచ్చారంటూ… మాజీ మంత్రి గుడివాడ అమర్‌నాథ్ వీడియో రిలీజ్ చేశారు. వైసీపీ విడుదల చేసిన వీడియోలో ఏపీ మాజీ బ్రాహ్మణ కార్పొరేషన్ చైర్మన్, VRDA చైర్మన్ కనిపిస్తున్నారు.
ఇదిలా ఉంటే.. జీవీఎంసీ అవిశ్వాస తీర్మాన వేళ కొత్త ట్విస్ట్ తెరపైకి వచ్చింది. కూటమి కార్పొరేటర్ భూపతిరాజు సుజాత మిస్ అయినట్టు తెలుస్తోంది. కూటమి కార్పొరేటర్లంతా మలేషియాకు వెళ్లగా.. అక్కడ ఆమె ఆచూకి మిస్ అయినట్టు తెలుస్తోంది. కార్పొరేటర్లంతా తిరిగి విశాఖకు వస్తున్నారు. అయితే సుజాత మిస్సింగ్ వెనక వైసీపీ ఉన్నట్టు అనుమానిస్తున్నారు. మరో ఇద్దరు టీడీపీ కార్పొరేటర్లు కూడా మేయర్‌కు వ్యతిరేకంగా ఓటు వేసేందుకు నిరాకరిస్తున్నట్టు తెలుస్తోంది. మరోవైపు అవిశ్వాస తీర్మానాన్ని పర్యవేక్షించేందుకు మంత్రి అచ్చెన్నాయుడు ఇప్పటికే విశాఖకు చేరుకున్నారు.