ప్రజాస్వామ్య వ్యవస్థలో వ్యక్తులు శాశ్వతం కాదు.. ఎప్పటికీ వ్యవస్థలే శాశ్వతం అని వైఎస్సార్‌సీపీ ఎమ్మెల్యే అంబటి రాంబాబు అభిప్రాయపడ్డారు. రాష్ట్ర ఎన్నికల కమిషనర్‌గా దళితుడు, న్యాయ కోవిదుడు, హైకోర్టు రిటైర్డ్ జడ్జి కనగరాజ్‌ను ప్రభుత్వం నియమించిందని చెప్పారు. దీనిపై చంద్రబాబు అనవసర రాద్ధాంతం చేస్తున్నారని అంబటి మండిపడ్డారు. శనివారం తాడేపల్లిలోని వైఎస్సార్‌సీపీ కేంద్ర కార్యాలయంలో ఆయన మీడియాతో మాట్లాడారు. తమిళనాడు రాష్ట్రంలోని ఓ సామాన్య దళిత కుటుంబంలో జన్మించి, మద్రాస్ హైకోర్టు జడ్జి స్థాయికి ఎదిగిన కనగరాజ్ రాష్ట్ర ఎన్నికల కమిషనర్ పదవికి అన్ని రకాల అర్హులన్నారు. అలాంటి వ్యక్తిని కమిషనర్‌గా నియమిస్తే ఎన్నికల వ్యవస్థ పటిష్టంగా, నిష్పక్షపాతంగా ఉంటుందని విశ్వాసం వ్యక్తం చేశారు. ఆయన ఇంకా ఏమన్నారంటే…
► వ్యవస్థలో మార్పు కోసమే ఎన్నికల కమిషనర్ పదవి కాలాన్ని ఐదేళ్ల నుంచి మూడేళ్లకు కుదించామన్నారు. ఇదేదో పెద్ద తప్పు అన్నట్లు, చీకటి పాలన అంటూ టీడీపీ, మరికొన్ని చిన్న పార్టీలు గగ్గోలు పెడుతున్నాయి.
► చంద్రబాబు నియమించిన వ్యక్తులే ఎల్లకాలం ఆ పదవిలో ఉండాలా? నిమ్మగడ్డ రమేష్‌కుమార్ ఒక్కరే ఆ పదవికి అర్హుడు అన్నట్లు చంద్రబాబు మాట్లాడుతున్నారు.
► ప్రభుత్వం తీసుకువచ్చిన సంస్కరణలను, ఆర్డినెన్స్‌ను పవన్ కళ్యాణ్ తప్పుపట్టడం ఏంటో అర్థం కావడం లేదు. బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు కన్నా లక్ష్మీనారాయణ ఆ పార్టీకి పట్టిన పచ్చ చీడ. రామకృష్ణ సీపీఐ పార్టీని టీడీపీ జేబు సంస్థగా మార్చారు. ఇలాంటి వారికి సీఎంను విమర్శించే అర్హత లేదు.
► దళితులను ఉన్నతమైన స్థానంలో కూర్చోబెడితే టెర్రరిస్టు రాజ్యమని మాజీ మంత్రి యనమల రామకృష్ణుడు విమర్శలు చేస్తున్నారు. రిఫరీగా ఉండాల్సిన నిమ్మగడ్డ రమేష్ ఫ్యాక్షనిస్ట్ ప్రభుత్వం అంటూ కేంద్రానికి లేఖలు రాస్తారా?
► కరోనా నియంత్రణకు ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్‌రెడ్డి అన్ని రకాల చర్యలు తీసుకుంటున్నారు. అదే సమయంలో ప్రభుత్వం చేయాల్సిన కార్యకలాపాలు చేస్తున్నారు.