తమిళనాడు రాజకీయాల్లో నేడు కీలక పరిణామం చోటుచేసుకుంది. అసెంబ్లీ ఎన్నికల నేపథ్యంలో బీజేపీ, అన్నాడీఎంకే పార్టీల మధ్య పొత్తు కుదిరింది. దీనిపై ఏపీ డిప్యూటీ సీఎం, జనసేన పార్టీ అధినేత పవన్ కల్యాణ్ స్పందించారు. బీజేపీ-అన్నాడీఎంకే కూటమికి శుభాకాంక్షలు అంటూ ఓ ప్రకటన విడుదల చేశారు.
తమిళనాడులో బీజేపీ, అన్నాడీఎంకే కలిసి ఎన్నికలకు వెళ్లాలని నిర్ణయించుకోవడం ఆహ్వానించదగిన పరిణామం అని అభివర్ణించారు. కూటమి తరపున సీఎం అభ్యర్థిగా పళనిస్వామి పేరు ప్రకటించారని, తద్వారా పాలనాపరమైన అనుభవం ఉన్నవారికి బాధ్యతలు అప్పగిస్తామని తమిళనాడు ప్రజలకు కూటమి తెలియజేసిందని పవన్ కల్యాణ్ వివరించారు. ఈ సందర్భంగా పళనిస్వామికి అభినందనలు తెలియజేస్తున్నానని పేర్కొన్నారు.
ఎన్డీయే పాలనా విధానాల ద్వారా రాష్ట్రాల అభివృద్ధి సాధ్యమవుతుందని, తమిళనాడు రాష్ట్రానికి ఎన్డీయే కూటమి ద్వారా కచ్చితంగా మేలు చేకూరుతుందని స్పష్టం చేశారు