ఫోన్ ట్యాపింగ్ కేసులో సంచలనం..!

తెలంగాణలో ఫోన్ ట్యాపింగ్ కేసులో మరో సంచలనం చోటు చేసుకుంది. ఈ కేసులో కీలక నిందితుడు మాజీ పోలీస్ అధికారి ప్రభాకర్ రావు చుట్టూ ఉచ్చు బిగిసింది. రేపో మాపో ఆయన ఇండియాకు రావాల్సిన పరిస్థితి ఏర్పడింది. తాజాగా ఆయన పాస్ పోర్టును రద్దు చేస్తూ కీలక నిర్ణయం తీసుకుంది పాస్ పోర్టు అథారిటీ ఆఫ్ ఇండియా.

 

క్లైమాక్స్‌లో ఫోన్ ట్యాపింగ్ కేసు

 

తెలంగాణ ఫోన్ ట్యాపింగ్ కేసు క్లైమాక్స్‌కు చేరింది. ఈ కేసులో కీలక నిందితుడు విచారణకు హాజరయ్యారు. తాజాగా శుభ పరిణామం చోటు చేసుకుంది. మాజీ పోలీసుల అధికారి ప్రభాకర్‌రావు పాస్‌పోర్ట్ రద్దు చేసింది పాస్ పోర్ట్ అథారిటీ ఆఫ్ ఇండియా. ఈ విషయాన్ని హైదరాబాద్ పోలీసులకు తెలిపారు. కీలక నిందితుడి పాస్‌పోర్ట్ రద్దు కావడంతో అమెరికాలో ప్రభాకర్‌రావుకు గ్రీన్‌కార్డు నిరాకరించినట్టు తెలుస్తోంది.

 

ట్రంప్ సర్కార్ వచ్చిన తర్వాత అమెరికాలో ఉన్న విదేశీయులను వెనక్కి పంపే ప్రయత్నాలు జోరందుకున్నాయి. ముఖ్యంగా 60 ఏళ్లు పైబడినవారు ఎక్కువగా ఉన్నట్లు సమాచారం. వారిని ఎయిర్‌పోర్టులో అడ్డగించి సంతకాలు చేయించుకుని వెనక్కి పంపేస్తున్నారు.

 

ఇక ప్రభాకర్ రావు విషయానికి వద్దాం. అమెరికా కాన్సులేట్-విదేశీ వ్యవహారాల శాఖ సహకారంతో ఆయన్ని ఇండియాకు రప్పించేందుకు ప్రయత్నాలు తీవ్రతరం చేశారు హైదరాబాద్ పోలీసులు. పాస్‌పోర్టు రద్దు కావడంతో ఇప్పుడున్న పరిస్థితుల్లో ఆయన ఇండియాకు రావాల్సిన పరిస్థితి ఏర్పడింది. ఈ కేసులో ఇప్పటికే రెడ్ కార్నర్ నోటీసులు జారీ అయ్యాయి. దీంతో ప్రభాకర్‌రావు చుట్టూ ఉచ్చు బిగిసుకున్నట్లు అయ్యింది.

 

ముందస్తు బెయిల్‌పై

 

మరోవైపు కీలక నిందితుడిగా ప్రభాకర్‌రావు ముందస్తు బెయిల్‌ పిటిషన్‌పై పోలీసులు కౌంటర్‌ దాఖలు చేశారు. ఇందులో ఆయన కీలకమని ప్రస్తావించారు. ఎస్‌ఐబీలో ఎస్‌వోటీని నెలకొల్పింది ఆయనేనని న్యాయస్థానానికి వివరించారు. ఫోన్‌ ట్యాపింగ్‌ ప్రధాన లక్ష్యంగా ఎస్‌వోటీ విధులు నిర్వహించిందని, రాజకీయ నేతలు, అధికారులు, వ్యాపారులు, బెదిరించి డబ్బు వసూలు చేసినట్టు పేర్కొన్నారు.

 

ఐపీఎస్‌ అధికారిగా పదవీ విరమణ చేసిన ప్రభాకర్‌రావు చట్టపరంగా దర్యాప్తుకు సహకరించలేదని తెలిపారు. తొమ్మిది నెలలు గడిచినా తిరిగి ఇండియాకు రాలేదని, పబ్లిక్‌ ప్రాసిక్యూటర్‌ కోర్టుకు వివరించారు. ఆయన వేసిన ముందస్తు బెయిల్‌ పిటిషన్‌ కొట్టివేసి దర్యాప్తునకు సహకరించేలా ఆదేశాలివ్వాలని విజ్ఞప్తి చేశారు. ఇంటర్‌పోల్‌ రెడ్‌కార్నర్‌ నోటీసులు జారీ చేయడంతో న్యాయస్థానాన్ని ఆశ్రయించారు ప్రభాకర్‌రావు.

 

శ్రవణ్‌రావు ఏం చెప్పారు?

 

తదుపరి విచారణను ఈ నెల 15కి వాయిదా వేసింది న్యాయస్థానం. ఈ కేసులో ఆరో నిందితుడు శ్రవణ్‌రావు మూడో సారి సిట్‌ విచారించింది. మంగళవారం దాదాపు 11 గంటలపాటు సిట్ అధికారులు వివిధ కోణాల్లో ప్రశ్నించారు. ఎస్‌ఐబీ మాజీ డీఎస్పీ ప్రణీత్‌రావు వాంగ్మూలం ఆధారంగా ప్రశ్నించినట్టు తెలుస్తోంది.

 

ఓ చానల్‌ అధినేతగా వృత్తిపరమైన సమాచారం కోసం వెళ్లానని బదులిచ్చారట. తనకున్న పరిచయాలతో రాజకీయ, వ్యాపార రంగాలకు చెందిన వ్యక్తుల సమాచారం సేకరించి ఇవ్వడంపై ప్రశ్నించారు. ఆనాటి ప్రతిపక్షానికి మద్దతుగా ఉన్నవారిని గుర్తించి ఆ వివరాలను ప్రణీత్‌కు ఇచ్చారని తెలుస్తోంది. ఓవరాల్‌గా చూస్తే.. ఏప్రిల్ చివరినాటికి ఈ కేసు ఓ కొలిక్కి వస్తుందని ఓ అంచనా.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *