తెలంగాణ రాష్ట్రంలోని మందుబాబులకు ఇది గుడ్ న్యూస్ అనే చెప్పవచ్చు. మందు బాబులకు త్వరలోనే కొత్త బ్రాండ్లు అందుబాటులోకి రానున్నాయి. మొత్తం 644 కొత్త బ్రాండ్లు రాష్ట్రంలో అందుబాటులోకి రానుండగా.. వీటిలో 371 రకాల ఇండియన్ మేడ్, 273 రకాల ఫారిన్ మేడ్ లిక్కర్ బ్రాండ్లు ఉండనున్నట్టు ఎక్సైజ్ శాఖ కమిషనర్ హరికిరణ్ తెలిపారు.
కొత్తగా మార్కెట్లోకి రానున్న వీటిలో 386 బ్రాండ్ల మద్యం విక్రయించటానికి 47 కొత్త కంపెనీలు దరఖాస్తు చేసినట్టుగా ఎక్సైజ్ వాఖ కమిషనర్ హరి కిరణ్ పేర్కొన్నారు. మరో 218 బ్రాండ్ల మద్యం అమ్మకాలకు 45 పాత కంపెనీలు దరఖాస్తు చేసుకున్నాయని ఆయన చెప్పారు. కొత్త బ్రాండ్ల మద్యం అమ్మకాలు చేయాలనుకునే కంపెనీలు దరఖాస్తులు చేసుకోవాలంటూ ఫిబ్రవరి 23న ఎక్సైజ్ శాఖ నోటిఫికేషన్ ను జారీ చేసిన విషయం తెలిసిందే. మార్చి 15వ తేదీని చివరి గడువుగా అధికారులు పేర్కొన్నారు.
కాగా.. టీజీబీసీఎల్ కొత్త నిబంధనల ప్రకారం అవసరమైన పత్రాలను సమర్పించ లేకపోతున్నామని తెలిపిన ఆయా కంపెనీల ప్రతినిధులు మరికొంత గడువు అడిగారు. ఈ క్రమంలో ఈ నెల 2 వ తేదీ వరకు గడువును పొడిగించారు. వచ్చిన అప్లికేషన్ లను పరిశీలించిన అనంతరం ప్రభుత్వ ఆమోదం మేరకు కొత్త బ్రాండ్ల విక్రయాలకు అనుమతులు ఇవ్వనున్నట్టు ఎక్సైజ్ కమిషనర్ హరికిరణ్ తెలిపారు