జగన్ క్షమాపణ చెప్పాల్సిందే.. ఏపీ పోలీస్ అధికారుల సంఘం వార్నింగ్

బట్టలూడదీసి నిలబెడతాం అంటూ.. రాయలసీమ పరామర్శ యాత్రలో పోలీసులపై ఘాటు వ్యాఖ్యలు చేశారు మాజీ సీఎం జగన్. జగన్ సినిమా హీరోలాగా పంచ్ డైలాగ్ చెప్పినట్టు, ఏపీ పోలీసులంతా విలన్లు అయినట్టు.. వైసీపీ అనుకూల మీడియా, సోషల్ మీడియా ఆ డైలాగ్ ని విపరీతంగా సర్కులేట్ చేశాయి. అక్కడ సీన్ కట్ చేస్తే.. జగన్ పంచ్ డైలాగ్ బూమరాంగ్ అయింది. ఏపీ పోలీసుల్లో చాలామంది ఈ వ్యాఖ్యలను ఖండించారు. కొంతమంది బహిరంగంగా తమ అసంతృప్తి వ్యక్తం చేస్తే, మరికొందరు మనసులోనే ఆయన్ను తిట్టుకున్నారు. తాజాగా ఏపీ పోలీస్ అధికారుల సంఘం జగన్ వ్యాఖ్యల్ని తప్పుబట్టింది. పోలీసులను బట్టలూడదీసి నిలబెడతామని ఒక మాజీ సీఎం అనడం గర్హనీయమని చెప్పారు పోలీసు అధికారుల సంఘం రాష్ట్ర అధ్యక్షుడు శ్రీనివాసరావు.

 

క్షమాపణ చెప్పాల్సిందే..

జగన్‌ వ్యాఖ్యలపై సభ్యసమాజం ఆలోచించాలన్నారు పోలీస్ అధికారులు. బట్టలూడదీసి నిలబెట్టడానికి ఇదేమైనా ఫ్యాషన్‌ షోనా? అంటూ కౌంటర్ ఇచ్చారు. పోలీస్ ఉద్యోగం తీవ్రమైన ఒత్తిడితో కూడుకుని ఉంటుందని, ప్రతి నిత్యం ఒత్తిడితో ఉద్యోగాలు చేస్తున్న తమపై ఇలాంటి వ్యాఖ్యలు చేయడం సరికాదని అన్నారు. జగన్ తన వ్యాఖ్యల్ని వెనక్కి తీసుకోవాలని ఏపీ పోలీసులకు బేషరతుగా క్షమాపణలు చెప్పాలని డిమాండ్ చేసారు. జగన్ క్షమాపణలు చెప్పకపోతే తాము న్యాయపోరాటం చేస్తామని తేల్చి చెప్పారు ఏపీ పోలీస్ అధికారుల సంఘం నేతలు.

 

మహిళలు కూడా ఉన్నారు జగన్..

పోలీసు ఉద్యోగులుగా మహిళలు కూడా ఉన్నారనే విషయాన్ని జగన్‌ మరచిపోయారా అని ప్రశ్నించారు పోలీస్ అధికారుల సంఘం సభ్యురాలు భవాని. జగన్ వ్యాఖ్యలు తమ మనోభావాల్ని దెబ్బతీశాయన్నారు. పోలీసులంటే ఆయనకు గౌరవం లేదని అర్థమవుతోందని, వెంటనే తన వ్యాఖ్యల్ని వెనక్కి తీసుకోవాలని ఆమె డిమాండ్‌ చేశారు.

 

ఇక జగన్ వ్యాఖ్యలపై శ్రీ సత్యసాయి జిల్లా ఎస్పీ రత్న కూడా పరోక్షంగా స్పందించారు. నేరుగా ఆయన వ్యాఖ్యలపై స్పందించను అంటూనే.. కౌంటర్ ఇచ్చారు. పోలీస్ యూనిఫామ్ తాము కష్టపడి సాధించుకున్నదని, ఎవరో తమకు ఇచ్చింది కాదన్నారు ఎస్పీ రత్న. ఒకవేళ పోలీసులు ఎవరైనా తప్పు చేసి ఉంటే.. సర్వీస్ రూల్స్ ప్రకారం చర్యలు తీసుకోవచ్చన్నారు. తాము తమ డ్యూటీ మాత్రమే చేశామని. ఎవరికి అనుకూలంగానో, వ్యతిరేకంగానో పని చేయలేదని చెప్పారు.

 

అరటి తొక్క అనుకున్నావా..?

రామగిరి ఎస్సై జి.సుధాకర్ యాదవ్, జగన్ వ్యాఖ్యలపై అదే స్థాయిలో విరుచుకుపడ్డారు. బట్టలూడదీస్తానంటూ జగన్ అంటున్నారని, తాము ధరించే ఖాకీ బట్టలు జగన్ ఇచ్చినవి కాదని, పోటీ పరీక్షల్లో నెగ్గి, కష్టపడి సాధించుకున్నవని చెప్పారు. ఎవడో వచ్చి ఊడదీయటానికి ఇది అరటి తొక్క కాదని కౌంటర్ ఇచ్చారు.

 

ఇదే మొదటిసారి కాదు..

గతంలో కూడా జగన్ పోలీసులపై ఇలాంటి తీవ్ర వ్యాఖ్యలే చేశారు. తాము అధికారంలో ఉన్నన్ని రోజులు పోలీసులపై ఎలాంటి కంప్లయింట్స్ చేయని, జగన్ అధికార మార్పిడి జరగగానే పోలీసులు ప్రలోభాలకు లొంగిపోయారని, టీడీపీ చెప్పినట్టల్లా ఆడుతున్నారని విమర్శించేవారు. రెడ్ బుక్ విషయంలో పోలీసులు కూడా టీడీపీ నేతలకు సపోర్ట్ చేస్తున్నారని అన్నారు. తాజాగా జగన్ మరో అడుగు ముందుకేసి బట్టలూడదీస్తానంటూ ఘాటు వ్యాఖ్యలు చేయడం సంచలనంగా మారింది.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *