ప్రముఖ క్రైస్తవ మత ప్రబోధకుడు, ఎవాంజలిస్ట్ పాస్టర్ ప్రవీణ్ పగడాల అనుమానాస్పద మృతి.. రెండు తెలుగు రాష్ట్రాల్లో సంచలనం సృష్టించింది. ఆయన మరణంపై అన్ని కోణాల్లోనూ దర్యాప్తు జరిపించాలనే డిమాండ్ ఊపందుకుంటోంది. ఆయన హత్యకు గురై ఉండొచ్చనే అనుమానాలు వెల్లువెత్తుతున్నాయి.
రాజమండ్రి సమీపంలో..
తూర్పు గోదావరి జిల్లా చాగల్లులో క్రైస్తవ మహాసభలకు హాజరు కావడానికి బుల్లెట్‌పై రాజమండ్రికి బయలుదేరిన ఆయన అనుమానాస్పద స్థితిలో మృతి చెందిన విషయం తెలిసిందే. కిందటి నెల 25వ తేదీన రాత్రి రాజమండ్రి సమీపంలోని కొంతమూరు వద్ద రోడ్డు పక్కన ఆయన మృతదేహాన్ని గుర్తించారు.
ప్రవీణ్ శరీరంపై గాయాలు ఉండటం, బలమైన వస్తువులతో కొట్టినట్టు కనిపించడం వల్ల పలు అనుమానాలు వ్యక్తం అయ్యాయి. గుర్తు తెలియని వ్యక్తులెవరైనా ఆయనను హత్య చేసి, రోడ్డు ప్రమాదంగా సృష్టించే ప్రయత్నం చేసి ఉండొచ్చంటూ సోషల్ మీడియా ప్లాట్‌ఫామ్‌లపై ఆందోళనలు వ్యక్తం అయ్యాయి.
ఆందోళన..
పాస్టర్ ప్రవీణ్ మృతి చెందిన విషయం తెలిసిన వెంటనే అటు క్రైస్తవ సంఘాలు, పాస్టర్లు కూడా పెద్ద ఎత్తున ఆందోళనలకు దిగారు. ప్రభుత్ ఆసుపత్రి వద్ద నిరసన చేపట్టారు. దీనిపై రాష్ట్ర ప్రభుత్వం సమగ్ర దర్యాప్తు జరిపించాల్సిన అవసరం ఉందంటూ డిమాండ్ చేశారు. పాస్టర్ ప్రవీణ్ మృతి ఉదంతం.. రాష్ట్రంలో శాంతిభద్రతలు క్షీణించాయనడానికి నిలువెత్తు నిదర్శనమంటూ విమర్శించారు.
సమగ్ర దర్యాప్తునకు..
ఈ పరిణామాలన్నింటిపై తాజాగా ఏపీ ప్రభుత్వం స్పందించింది. సమగ్ర దర్యాప్తునకు ఆదేశించింది. ఈ ఉదంతం పట్ల ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు, హోం శాఖ మంత్రి వంగలపూడి అనిత, మంత్రి నారా లోకేష్.. దిగ్భ్రాంతిని వ్యక్తం చేశారు. ఆయన కుటుంబానికి ప్రగాఢ సానుభూతిని తెలియజేశారు.
అన్ని కోణాల్లోనూ..
పాస్టర్ పగడాల ప్రవీణ్ మృతి ఘటనపై అన్ని కోణాల్లోనూ దర్యాప్తు జరిపిస్తామని చంద్రబాబు, నారా లోకేష్ హామీ ఇచ్చారు. ఈ మేరకు చంద్రబాబు.. డీజీపీ హరీష్ కుమార్ గుప్తాతో ఫోన్లో మాట్లాడారని తెలుస్తోంది. సమగ్ర విచారణ జరిపించాలంటూ ఈ సందర్భంగా చంద్రబాబు ఆయనకు ఆదేశించినట్లు చెబుతున్నారు.
పోలీసుల ప్రాథమిక దర్యాప్తులో..
పాస్టర్ పగడాల ప్రవీణ్ హఠాన్మరణం దిగ్భ్రాంతికి గురి చేసిందని మంత్రి లోకేష్ అన్నారు. ఆయన ఆత్మకు శాంతి కలగాలని ప్రార్థిస్తున్నట్లు తెలిపారు. కుటుంబ సభ్యులకు మంత్రి తన ప్రగాఢ సంతాపం తెలియజేశారు. పోలీసుల ప్రాథమిక దర్యాప్తులో రోడ్డు ప్రమాదంగా గుర్తించారని అన్నారు.
ఏపీ హైకోర్టుకు..
ఇప్పుడు తాజాగా ఈ అంశం ఏపీ హైకోర్టుకు చేరింది. ప్రముఖ క్రైస్తవ మత ప్రబోధకుడు, ప్రజా శాంతి పార్టీ అధ్యక్షుడు కేఏ పాల్ రంగంలోకి దిగారు. హైకోర్టులో ప్రజా ప్రయోజనాల వ్యాజ్యాన్ని దాఖలు చేశారు. ప్రవీణ పగడాల మృతిపై సమగ్ర విచారణ జరిపించేలా ఆదేశాలు జారీ చేయాలంటూ విజ్ఞప్తి చేశారు. ఈ ఉదంతం మొత్తాన్నీ సీబీఐతో విచారణ జరిపించాలని డిమాండ్ చేశారు.
దారుణ హత్యగా..
ప్రవీణ పగడాల అనుమానాస్పద మృతిని దారుణ హత్యగా అభివర్ణించారు కేఏ పాల్. దీనిపై ఎనిమిది రోజుల పాటు గడువు ఇచ్చానని, అయినప్పటికీ ప్రభుత్వం నుంచి స్పందన రాకపోవడం వల్ల హైకోర్టును ఆశ్రయించనట్లు తెలిపారు. దేశవ్యాప్తంగా లక్షలాదిమంది క్రిస్టియన్లు.. ప్రవీణ పగడాల మృతిపై అనేక అనుమానాలను వ్యక్తం చేస్తోన్నారని, విదేశాల్లోనూ దీనిపై చర్చ జరుగుతోందని అన్నారు.
దేశ పరువు ప్రతిష్ట సైతం..
ఎవాంజలిస్ట్ పాస్టర్ ప్రవీణ పగడాల అనుమానాస్పద మృతి వెనుక వాస్తవం ఏమిటనే విషయాన్ని తెలుసుకోవాలని ప్రతి క్రైస్తవుడూ కోరుకుంటోన్నారని కేఏ పాల్ చెప్పారు. ఈ ఘటన వల్ల దేశ పరువు ప్రతిష్ట సైతం మంటగలుస్తోందంటూ ఆందోళన వ్యక్తం చేశారు.
అది హత్యే..
అది హత్యా లేక ప్రమాదమా అనేది తెలియట్లేదని, తనకు అందిన సమాచారం, ఫొటోలు, వీడియోలు, మృతదేహంపై ఉన్న గాయాలు, మరణించిన తీరును బట్టి చూస్తే అది హత్యేనని కేఏ పాల్ అన్నారు. అది ప్రమాదమే అనడానికి ఉద్దేశించిన ఎలాంటి వీడియోలను కూడా విడుదల చేయడంలో పోలీసులు సైతం విఫలం అయ్యారని చెప్పారు.
మద్యం కొనడానికి..
హైదరాబాద్ నుంచి రాజమండ్రిపై బైక్‌పై వెళ్తోన్న ఫొటోలు, వీడియోలు మాత్రమే ఇప్పటివరకు విడుదల అయ్యాయని అన్నారు. మద్యం కొనడానికి ఓ షాప్‌కు వెళ్లారంటూ సోషల్ మీడియాలో సర్కులేట్ అవుతున్న వీడియోలో ఉన్నది తన సోదరుడు కాదంటూ ప్రవీణ్ పగడాల చెల్లెలు స్పష్టం చేశారని గుర్తు చేశారు.
22 ప్రశ్నలను సంధించా..
ప్రవీణ్ పగడాల అనుమానాస్పద మృతి వెనుక తాను ఇప్పటివరకు 22 ప్రశ్నలను సంధించానని, ఇందులో ఏ ఒక్క దానికీ సమాధానం రాలేదని కేఏ పాల్ అన్నారు. ఆయన మరణించిన ఇన్ని రోజుల తరువాత కూడా ఇప్పటివరకూ పోస్ట్ మార్టమ్ నివేదిక అందలేదని ప్రశ్నించారు. ఇలాంటి ఉదంతం తానెప్పుడూ చూడలేదని పేర్కొన్నారు.
తీరిక ఏపీ ఉప ముఖ్యమంత్రికి ఉందేగానీ..
రాష్ట్రవ్యాప్తంగా అన్ని జిల్లాల్లో ఎన్ని చర్చ్‌లు అక్రమంగా నిర్మించారు? ఎన్ని సక్రమంగా నిర్మితం అయ్యాయో తెలుసుకోవాలని, నివేదిక అందజేయాలంటూ ఉత్తర్వులను జారీ చేసేంత తీరిక ఏపీ ఉప ముఖ్యమంత్రికి ఉందే గానీ.. దీనిపై ఎందుకు ఆరా తీయట్లేదని ప్రశ్నించారు. దేవాలయాలు, మసీదులు ఎన్ని అక్రమంగా నిర్మించారో తెలుసుకోవట్లేదని కేఏ పాల్ ప్రశ్నించారు.
సీబీఐతో విచారణ..
పాస్టర్ ప్రవీణ్ పగడాల మృతి వ్యవహారం మొత్తాన్నీ కూడా సీబీఐతో విచారణ జరిపించాలని, తక్షణమే పోస్ట్‌మార్టమ్ నివేదికను విడుదల చేయాల్సిన అవసరం ఉందంటూ కేఏ పాల్ డిమాండ్ చేశారు.