దేశవ్యాప్తంగా కరోనా వైరస్ విజృంభిస్తుంది . అయినా సరే ఆంధ్రప్రదేశ్ రైతులకు ఇబ్బంది కలగకుండా, గ్రామస్థాయిలో పంటల కొనుగోళ్లు సోమవారం నుంచి ప్రారంభం కానున్నాయి. గతంలో రాష్ట్ర ప్రభుత్వం శనగలు, కందులు, జొన్న, మొక్కజొన్న, పసుపు, అపరాల కొనుగోలుకు మండల స్థాయిలో కేంద్రాలను ఏర్పాటుచేసింది. కానీ, ప్రస్తుతం కరోనా నేపథ్యంలో రైతులు తమ పంటలను ఈ కేంద్రాలకు తరలించడానికి ఇబ్బందిపడే అవకాశాలు ఉండటంతో గ్రామస్థాయిలోనే కొనుగోలు కేంద్రాలను ఏర్పాటుచేయాలని సీఎం వైఎస్ జగన్ ఆదేశించారు. దీంతో 786 కేంద్రాల ఏర్పాటుకు మార్క్‌ఫెడ్ చర్యలు చేపట్టింది. ఇందులో భాగంగా ఇప్పటివరకు దాదాపు 700 కేంద్రాలను పెట్టగా.. మిగిలినవి రెండు మూడ్రోజుల్లో ఏర్పాటుకానున్నాయి.