కోవిడ్‌-19 దెబ్బకి ఒక్కరోజులో 35 మంది మృతి : భయాందోళనలో ప్రజలు

దేశవ్యాప్తంగా కరోనా వైరస్ విజృంభిస్తుంది . కోవిడ్‌-19 పాజిటివ్‌ కేసులతో పాటు మరణాలు సంఖ్య కూడా రోజు రోజుకు పెరుగుతూనే ఉంది. గత 24 గంటల్లో కరోనా కాటుతో 35 మంది మృతి చెందారని కేంద్ర ఆరోగ్య శాఖ ప్రకటించింది. దీంతో దేశ వ్యాప్తంగా సోమవారం ఉదయం నాటికి కరోనా మరణాల సంఖ్య 308కు చేరింది. మొత్తంగా 9,152 కరోనా పాజిటివ్‌ కేసులు నమోదయ్యాయి. వీరిలో 856 మంది కరోనా నుంచి కోలుకుని ఆస్పత్రి నుంచి డిశ్చార్జ్‌ అయ్యారు. భారత్‌ యాక్టివ్ కరోనా పాజిటివ్ కేసులు 7,987 అని కేంద్ర ఆరోగ్యశాఖ వెల్లడించింది.  కరోనా సంబంధిత మరణాల్లో మహారాష్ట్ర అగ్రస్థానంలో కొనసాగుతోంది. ఈ రాష్ట్రంలో ఇప్పటికే 149 మంది బలయ్యారు. మధ్యప్రదేశ్‌లో 36 మంది, గుజరాత్‌లో 25 మంది, ఢిల్లీలో 24, పంజాబ్‌లో 11 మంది, తమిళనాడులో 11 మంది మరణించారు.  అత్యధికంగా మహారాష్ట్రలో 1985 కరోనా పాజిటివ్‌ కేసులు నమోదయ్యాయి. ఢిల్లీలో 1154, తమిళనాడులో 1043, రాజస్తాన్‌లో 804, మధ్యప్రదేశ్‌లో 564, ఉత్తరప్రదేశ్‌లో 483, కేరళలో 376, గుజరాత్‌లో 516, కర్ణాటకలో 232, జమ్మూకశ్మీర్‌లో 245, పంజాబ్‌లో 151, పశ్చిమబెంగాల్‌లో 152 పాజిటివ్‌ కేసులు నమోదయ్యాయి.  

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *