తెలంగాణలో బుధవారం నుంచి అసెంబ్లీ బడ్జెట్ సమావేశాలు మొదలయ్యాయి. సమావేశాలు వాడివేడీగా జరుగుతాయని నేతలు భావిస్తున్నారు. అయితే బుధవారం రాత్రి సీఎం రేవంత్‌రెడ్డి ఢిల్లీకి వెళ్లడం వెనుక ఏం జరిగింది? అధికారులు ఏమంటున్నారు? పార్టీ నేతలు ఏ విధంగా చర్చించుకుంటు న్నారు? రేపో మాపో కీలక విషయం బయటకు వస్తుందన్నది కొందరి నేతల మాట. దీనిపై తెలంగాణ అంతటా చర్చ జరుగుతోంది.
తెలంగాణ బడ్జెట్ సమావేశాలు బుధవారం ప్రారంభమయ్యాయి. గురువారం నుంచి అధికార కాంగ్రెస్-విపక్షాలు బీఆర్ఎస్, బీజేపీ మధ్య మాటల యుద్ధం మొదలుకావడం ఖాయమని భావించారు. దీనికి సంబంధించి ఎమ్మెల్యేలతో ప్రత్యేకంగా భేటీ అయ్యారు ముఖ్యమంత్రి. సభలో సభ్యులు అనుసరించాల్సిన వ్యూహంపై చర్చించారు. ఎమ్మెల్యేలకు ఇవాల్సిన సూచనలు, సలహాలు ఇచ్చారు.
సీఎం రేవంత్ ఢిల్లీ టూర్ వెనుక
బుధవారం రాత్రి హైదరాబాద్ నుంచి ఢిల్లీకి వెళ్లారు సీఎం రేవంత్‌రెడ్డి. బడ్జెట్ సమావేశాలు పెట్టుకుని హస్తిన టూర్ వెనుక ఏం జరుగుతోంది అనే చర్చ మొదలైంది. రాములమ్మకు కేబినెట్ పదవి ఇస్తారేమో, అందుకోసమే వెళ్లినట్టు కొందరు అంటున్నారు. మరికొందరు మాత్రం అదేమీ కాదని, ఫోన్ ట్యాపింగ్ కేసు ఓ కొలిక్కిరావడం ఖాయమని అంటున్నారు. ఈ కేసులో విదేశాంగ శాఖ జోక్యం చేసుకుంటే నిందితులు తెలంగాణకు వస్తారని అంటున్నారు.
గతవారం ఢిల్లీ వెళ్లారు సీఎం రేవంత్‌రెడ్డి. అప్పుడే విదేశాంగ మంత్రి జై శంకర్‌తో సమావేశం కావాలని నిర్ణయించారు. కాకపోతే కేంద్ర మంత్రి బిజీ షెడ్యూల్ కారణంగా భేటీ సాధ్యం కాలేదని అధికారిక వర్గాల మాట. ప్రస్తుతం విదేశాంగ మంత్రి జై శంకర్ ఢిల్లీలో ఉన్నారు. సీఎంకు అపాయింట్మెంట్ ఇచ్చినట్టు తెలుస్తోంది. ఈ క్రమంలో సీఎం రేవంత్‌రెడ్డి వెళ్లారని అంటున్నారు.
అధికారుల వెర్షన్
అధికారుల నుంచి వస్తున్న సమాచారం మేరకు.. తెలంగాణ నుంచి ఉద్యోగాల కోసం గల్ఫ్‌కు వెళ్లినవారు చిన్నచిన్న తప్పుల కారణంగా ఏళ్ల తరబడి అక్కడి జైలులో మగ్గుతున్నారు. వారి గురించి ప్రభుత్వానికి సమాచారం తెలిసింది. ఈ క్రమంలో వారిని తిరిగి తీసుకురావాలని కేంద్రాన్ని అభ్యర్థించనున్నారు సీఎం రేవంత్‌రెడ్డి. స్వదేశానికి వారిని రప్పించడానికి వేగంగా పావులు కదుపుతున్నారు.
నేతల వెర్షన్
రాజకీయ నేతల నుంచి వస్తున్న సమాచారం మేరకు.. దేశవ్యాప్తంగా సంచలనం సృష్టించింది తెలంగాణ ఫోన్ టాపింగ్ కేసు. దీనిపై విదేశాంగ మంత్రి జయశంకర్‌తో చర్చించేందుకు సీఎం రేవంత్‌రెడ్డి ఢిల్లీకి వెళ్లినట్టు తెలుస్తోంది. ఈ కేసుకు సంబంధించి కీలక నిందితులు విదేశాలలో తలదాచుకుంటున్నారు. వారు స్వదేశానికి రప్పించి శిక్ష వేయాలని నిర్ణయించుకుంది తెలంగాణ ప్రభుత్వం.
నిందితులను రాష్ట్రానికి రప్పించే విషయమై కేంద్రమంత్రి జైశంకర్‌కు విజ్ఞప్తి చేయనున్నారు ముఖ్యమంత్రి. ఈ కేసులో ప్రభాకర్‌రావు, శ్రవణ్‌రావు విదేశాల్లో ఉంటున్నారు. వలసవాదులపై అమెరికా కొరడా ఝులిపించడంతో కెనడాకు ప్రభాకర్‌రావు, బెల్జియంలో శ్రవణ్‌రావు తలదాచుకున్నట్లు చెబుతున్నారు.
వీరిద్దరిపై రెడ్ కార్నర్ నోటీసు జారీ చేయాలని సీబీఐ నిర్ణయించింది. ఆ మేరకు ఇంటర్ పోల్‌కు సమాచారం ఇచ్చింది. ఇంటర్ పోల్ అధికారులు దాదాపు 196 దేశాల్లోని ఇమిగ్రేషన్ అధికారులను అలర్ట్ చేశారు. రేపో మాపో చిక్కడం ఖాయమని అంటున్నారు.
ఇదిలాఉండగా నిందితుల వీసా గడువు ముగిసింది. రెన్యువల్ కోసం తెలంగాణ రీజినల్ పాస్‌పోర్టు కార్యాలయానికి దరఖాస్తు చేయలేదని గుర్తించారు పోలీసులు. ఈనెల చివరులోగా నిందితులు తెలంగాణకు రావడం ఖాయమని అంటున్నారు. అదే జరిగితే బీఆర్ఎస్‌లో కీలక నేతలకు ఇబ్బందులు తప్పవని అంటున్నారు.