తెలంగాణ రాష్ట్రాన్ని ఎకో టూరిజం ద్వారా మరింత అభివృద్ధి పథంలో నడిపించేందుకు త్వరలో విధి విధానాలు తయారు చేస్తున్నట్లు సీఎం రేవంత్ రెడ్డి అన్నారు. రంగారెడ్డి జిల్లా చిలుకూరు బాలాజీ టెంపుల్ రోడ్డు లోని ప్రొద్దుటూరు గ్రామంలో ప్రపంచ స్థాయి ప్రమాణాలతో రూపుదిద్దుకున్న ఎక్స్పీరియం థీమ్ పార్క్ ను సీఎం రేవంత్ రెడ్డి ప్రారంభించారు. ఈ కార్యక్రమంలో మెగాస్టార్ చిరంజీవి, మంత్రి జూపల్లి కృష్ణారావు పలువురు పాల్గొన్నారు.
ప్రారంభోత్సవం అనంతరం సీఎం మాట్లాడుతూ.. ఎకో టూరిజం అభివృద్ధికి ప్రభుత్వం నిర్ణయం తీసుకున్న సమయంలో, ప్రొద్దుటూరులో 25వేల జాతుల మొక్కలు వృక్షాలతో థీమ్ పార్క్ ను 150 ఎకరాల విస్తీర్ణంలో ఏర్పాటు చేయడం అభినందించదగ్గ విషయమన్నారు. కొద్ది రోజుల్లోనే టూరిజం పాలసీ విధానంలో భాగంగా ఎకో టూరిజం ను విస్తరించేందుకు తగిన చర్యలు ప్రభుత్వం తీసుకుంటుందన్నారు. సాధారణంగా ఇంటి పరిసరాల మొక్కలు కొనుగోలు చేసేందుకు గోదావరి జిల్లాలకు వెళుతుంటారని, ప్రస్తుతం ఇక్కడ ఏర్పాటుచేసిన థీమ్ పార్క్ ఎన్నో అరుదైన మొక్కలను ప్రజలకు చేరువ చేసిందన్నారు.
గత ప్రభుత్వ హయాంలో టూరిజం నిర్లక్ష్యానికి గురైందని, కాంగ్రెస్ ప్రభుత్వం ఓవైపు సంక్షేమ పథకాలు అమలు చేస్తూ మరోవైపు రాష్ట్ర అభివృద్ధికి కృషి చేస్తుందన్నారు. వికారాబాద్ మరింత అభివృద్ధి పథంలో నడుస్తుందని, దావోస్ పర్యటనలో పెట్టుబడులను సాధించినట్లు సీఎం అన్నారు. ఆ పెట్టుబడుల రాకతో వికారాబాద్ ముఖచిత్రం పూర్తిస్థాయిలో మారుతుందన్నారు. ఖమ్మం జిల్లాకు చెందిన రామయ్య అనే రైతు మొక్కలను పరిరక్షించి పద్మశ్రీ అవార్డు అందుకోవడం యావత్ తెలంగాణకు గర్వకారణమన్నారు.
రాబోయే రోజుల్లో కోటి మొక్కలను నాటే కార్యక్రమానికి శ్రీకారం చుట్టనున్నట్లు, అందుకు రైతులు పెంచిన మొక్కలను తగిన రుసుము చెల్లించి తీసుకునే అవకాశం పై ప్రభుత్వం ఆలోచిస్తుందన్నారు. తెలంగాణ రాష్ట్రాన్ని ప్రకృతి వనంగా మార్చడమే తమ ముందున్న లక్ష్యమని, అందుకు ప్రతి విద్యార్థి సహకరించాలన్నారు. తల్లి పేరు మీద ప్రతి విద్యార్థి మొక్క నాటాలని ఈ సందర్భంగా సీఎం రేవంత్ రెడ్డి పిలుపునిచ్చారు.