ఎన్నికల్లో ఇచ్చిన హామీలపై ఫోకస్ చేసింది రేవంత్ సర్కార్. పథకాలకు లబ్దిదారుల ఎంపిక పూర్తికావడంతో ఆ వైపు దృష్టి పెట్టింది. తొలుత ఇందిరమ్మ ఇళ్లకు ఇసుక సరఫరాపై దృష్టి పెట్టింది. నలుగురు ఉన్నతాధికారులతో కమిటీ నియమించింది. దీనిపై వారంలోగా నివేదిక సమర్పించాలని ఆ కమిటీని ఆదేశించింది.
సచివాలయంలో సీఎం రేవంత్‌రెడ్డి మంగళవారం సమీక్ష నిర్వహించారు. రాష్ట్రంలో పెద్ద సంఖ్యలో ఇందిరమ్మ ఇళ్లు నిర్మాణం ప్రారంభించనున్నారు. లబ్ధిదారులకు ఇసుక ఏ విధంగా సరఫరా చేయాలనే దానిపై సమగ్రంగా అధ్యయనం చేయాలని అధికారులకు సూచించారు.
అధ్యయన కమిటీ సభ్యులుగా ఆర్థిక శాఖ ప్రత్యేక కార్యదర్శి రామకృష్ణారావు, గనుల శాఖ కార్యదర్శి ఎన్.శ్రీధర్, ఫ్లాగ్‌షిప్ ప్రోగ్రామ్స్ కమిషనర్ శశాంక, టీజీ ఎండీసీ మేనేజింగ్ డైరెక్టర్ సుశీల్ కుమార్‌లను నియమించారు. వారంలోపు అధ్యయనం పూర్తి చేసి సమగ్ర విధివిధానాలతో ఈ కమిటీ నివేదిక సమర్పించాలని ముఖ్యమంత్రి ఆదేశించారు.
రాష్ట్రంలో ప్రతీ ఏటా నిర్మాణాలు పెరుగుతున్నాయి. ఇసుక నుంచి ప్రభుత్వానికి ఆదాయం ఆశించినంత రాలేదు. అదే సమయంలో వినియోగదారులు ఎక్కువ ధరకే ఇసుక కొనుగోలు చేయాల్సి వస్తోంది. వినియోగదారులకు తక్కువ ధరకే ఇసుక దక్కేలా చూడాలని, ప్రభుత్వానికి ఆదాయం పెరిగేలా చూడాలని అధికారులకు సీఎం రేవంత్ రెడ్డి సూచించారు.
ఇసుక మాఫియాను అరికట్టేందుకు అవసరమైన అన్ని చర్యలు చేపట్టాలన్నారు. మేజర్, మైనర్ ఖనిజాల గనులకు వేసిన జరిమానాలు వసూళ్లు కాకపోవడంపై అధికారులను ప్రశ్నించారు. మేజర్, మైనర్ ఖనిజ విధానంపై సమగ్రంగా అధ్యయనం చేసి రెండు వారాల్లో నివేదిక సమర్పించాలని అధ్యయన కమిటీని ఆదేశించారు.
సమీక్షలో గృహనిర్మాణ శాఖ మంత్రి పొంగులేటి శ్రీనివాస్, ముఖ్యమంత్రి సలహాదారు వేం నరేందర్, ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి శాంతి కుమారి, సీఎం ముఖ్య కార్యదర్శి శేషాద్రి, ముఖ్యమంత్రి కార్యదర్శి మాణిక్ రాజ్ పాల్గొన్నారు. కమిటీ నివేదిక తర్వాత ఇందిరమ్మ ఇళ్లపై నిర్మాణం ప్రారంభం కానుంది. ఈ లెక్కన వచ్చే నెల 15 నుంచి ఇందిరమ్మ ఇళ్లు నిర్మాణం జరిగే అవకాశముందన్నది అధికారుల మాట.