ఏపీ కూటమి ప్రభుత్వం రైతన్నల పక్షాన ఉంటుందని మరోమారు నిరూపించుకుందని రైతన్నలు హర్షం వ్యక్తం చేస్తున్నారు. తాజాగా ప్రభుత్వం తీసుకున్న నిర్ణయం పట్ల రైతులు ఆనందం వ్యక్తం చేస్తున్నారు. తమ ఇబ్బందులను తెలుసుకున్న ప్రభుత్వం, కేవలం రూ. 2 లకే ఇటువంటి సౌకర్యం కల్పిస్తుందని ఊహించలేదని రైతులు తెలుపుతున్నారు. ఇంతకు ప్రభుత్వం తీసుకున్న ఆ నిర్ణయం ఏమిటో తెలుసుకుందాం.
అదొక మిర్చి యార్డు. ఆ మిర్చి యార్డు పేరున గుంటూరు కారం సినిమా కూడ వచ్చింది. ఈ సినిమా షూటింగ్ కూడా ఇక్కడ జరిగింది. ఇప్పటికే అర్థమైంది కదా.. ఆ మిర్చి యార్డు పేరు. ఔను.. మీరు అనుకున్నది కరెక్ట్.. అదే గుంటూరు మిర్చి యార్డు. ఈ యార్డుకు వచ్చే రైతన్నలు పడే ఇబ్బందులు అన్నీ ఇన్నీ కావు. సుదూర ప్రాంతాలకు చెందిన రైతులు ఇక్కడికి మిర్చి తెచ్చి విక్రయాలు సాగిస్తారు. ఎందరో రైతన్నలు గుంటూరు మిర్చియార్డుకు నిత్యం వస్తుంటారు. అసలే మిర్చి ఘాటు.. ఆ ఘాటుకు రైతన్నలు పడే ఇబ్బందులను తొలగించేందుకు ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది.
తాము కష్టపడి సాగు చేసిన మిర్చి పంటను అమ్ముకొనేందుకు సుదూర ప్రాంతాల నుండి రైతన్నలు మిర్చి యార్డుకు వస్తారు. అప్పటికే ప్రయాణం సాగించిన రైతన్నలకు సరుకు అమ్ముడు పోతుందో లేదోనన్న ఆలోచన కంటే, అక్కడి ఘాటును తట్టుకోవడం పెద్ద సమస్య. అంతేకాదు పెట్టుబడులు పెట్టి సాగు చేసిన పంటను అక్కడికి చేర్చేందుకు రవాణా ఖర్చును కూడ రైతే భరిస్తారు. అటువంటి రైతన్నలకు మార్కెట్ యార్డు వద్ద ఖర్చులు తగ్గించేందుకు ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది.
ఇటీవల సీఎం చంద్రబాబు సారథ్యంలోని కూటమి ప్రభుత్వం ధాన్యం అమ్మిన రైతన్నలకు 24 గంటల్లోగా నగదు జమ చేసి రికార్డు సృష్టించింది. ప్రభుత్వం తీసుకున్న ఆ నిర్ణయంతో హర్షం వ్యక్తం చేసిన రైతన్నలు, తాజాగా మిర్చి యార్డు వద్ద రైతన్నల సౌలభ్యం కోసం తీసుకున్న నిర్ణయం పట్ల హర్షం వ్యక్తం చేస్తున్నారు. తమ పంటను అమ్ముకోడానికి గుంటూరు మిర్చి యార్డుకు వచ్చిన రైతులకు ఉచితంగా అల్పాహారాన్ని, మధ్యాహ్న భోజనాన్ని ప్రభుత్వం గతం నుండే అందిస్తోంది. ఈ కార్యక్రమానికి కూడ టీడీపీ పాలనలో బీజం వేశారు. ఇప్పటికీ ఆ కార్యక్రమం సాగుతోంది.
తాజాగా ఇక్కడికి వచ్చే రైతుల కోసం ఇక్కడి అధికారులు మరో కీలక నిర్ణయం తీసుకున్నారు. కేవలం రూ. 2ల నామమాత్ర రుసుముతో రైతన్నలకు సెంట్రలైజడ్ ఏసీ సదుపాయంతో విశ్రాంతి తీసుకునే అవకాశాన్ని కూడా కల్పించారు. ఇలాంటి సదుపాయాన్ని కల్పించిన మార్కెట్ యార్డు అధికారులను సీఎం చంద్రబాబు ప్రత్యేకంగా అభినందించారు. ఇక్కడ కల్పించిన ఏసీ సౌకర్యంతో తాము విశ్రాంతి తీసుకొనేందుకు వీలుగా ఉందని రైతులు తమ అభిప్రాయం తెలిపారు.