రెండు తెలుగు రాష్ట్రాల్లో సంచలనం సృష్టించిన మీర్ పేట కేసులో పోలీసులు కీలక పురోగతి సాధించారు. విచారణ ప్రారంభించినప్పటి నుంచి వివిధ కోణాల్లో, విభిన్న తీరులుగా పరిశీలనలు చేస్తూ వచ్చిన పోలీసులు.. చివరకి మృతురాలి భర్త గురుమూర్తే నిందితుడిగా గుర్తించారు. అతనే భార్యను చంపి, మృతదేహాన్ని మాయం చేసినట్లు గుర్తించారు. చంపిన విధానంపై ఇన్నాళ్లు అనేక రకాలుగా ఊహాగానాలు సాగగా.. వాటిపై పోలీసులు ఓ నిర్ధరణకు వచ్చారు. చివరిగా.. వెంకట మాధవిని ఎలా చంపి, మాయం చేసింది వెల్లడించారు.
అప్పటి వరకు బాగానే ఉన్న పండంటి కాపురం పండుగ రోజే కకావిలలం అయ్యింది. సంక్రాతి రోజునే భర్యను కిరాతకంగా హత్య చేశాడు. అయితే.. ఇన్నాళ్లు వచ్చిన సమాచారంలో.. అనుకోకుండా జరిగిన గొడవలో భార్యపై చేయి చేసుకోవడంతో ఆమె అపస్మారక స్థితిలోకి వెళ్లి చనిపోయిందని అంతా భావించారు. ఆ తర్వాతే.. ఆమె పుట్టింటి వాళ్లు ఏమంటారో అనే భయం, పోలీసులు ఏం చేస్తారోననే ఆందోళనతో మృత దేహాన్ని మాయం చేశాడని అనుకున్నారు. కానీ.. పోలీసుల విచారణ ముగింపుకు వచ్చే వరకు అసలు నిజాలు వెల్లడయ్యాయి.
పండుగ రోజు గోడవ తర్వాత ఆమె అపస్మారక స్థితిలో కిందపడిపోయింది. అప్పటికి.. ఆమెకు బాగానే ఊపిరి ఆడుతుంది. కానీ.. గురుమూర్తి కావాలనే ఆమె ముఖానికి దిండు అదిమిపెట్టి, ఊపిరి ఆడకుండా చేసి చంపేసినట్లుగా వెల్లడైంది. దాంతో అతను ఎప్పటి నుంచే కాచుకూర్చుని, అదను చూసి హత్యకు పాల్పడినట్లుగా స్పష్టమవుతోంది. ఈ హత్య కేసులో మొదటి నుంచి కిరాతకంగానే వ్యవహరించి నిందితుడు.. కేసు విచారణలో పోలీసుల్ని సైతం తప్పుదోవ పట్టించాడు. అడుగడుగునా విచారణ సరిగా నడవకుండా లేనిపోని కథలు అల్లినట్లు పోలీసులు తెలిపారు.
ఆమె కనిపించకుండా పోయిన నేపథ్యంలో మిస్సింగ్ కేసు నమోదు చేసిన పోలీసులకు గురుమూర్తి తప్పుడు సమాచారం ఇచ్చాడు. ఆమెకు అక్రమ సంబంధాలున్నట్లు నమ్మించాడు. అందుకే.. ఇళ్లు వదిలి వెళ్లిందని మొదట చెప్పాడు. కానీ.. సీసీ కెమెరా పుటేజ్ చూసిన తర్వాత ఆమె ఇంట్లో నుంచి బయటకు వెళ్లలేదని నిర్ధరణ కావడంతో.. అక్రమ సంబంధ విషయమై ఇంట్లో గొడవ జరిగిందని, ఆ తర్వాతే తాను అనుకోకుండా చేయి చేసుకోవడంతో చనిపోయిందని మరోసారి చెప్పుకొచ్చాడు. కానీ.. ఆధారాలు లేకుండా చేయడం, అత్యంత పకడ్భందీగా సాక్షాధారాలను చెరిపేయడంతో పోలీసులు మరింత లోతుగా విచారణ చేపట్టారు. దాంతో.. అసలు విషయాలు ఒక్కొక్కటిగా వెల్లడిస్తూ వచ్చిన గురుమూర్తి, చివరకు జరిగిందంతా పోలీసుల ముందు చెప్పేశాడు. ఈ సందర్భంగానే.. అపస్మారక స్థితిలోకి వెళ్లిన భార్యను కావాలని దిండుతో అదిమిపెట్టి చంపేసినట్లు ఒప్పుకున్నాడు.
చనిపోయిన తర్వాత మృత దేహాన్ని నాలుగు ముక్కలుగా నరికినట్లు గుర్తించారు. వాటిని నీటిలో వేసి బాగా ఉడికిన తర్వాత బయటికి తీసి కాల్చివేశాడు. కాలిపోయిన ఎముకలన్నింటినీ ఇనుప రాడ్డుతో పొడిగా తయారు చేసిన గురుమూర్తి.. ఎముకల పొడి మొత్తాన్ని తీసుకెళ్లి చెరువులో చల్లినట్లు పోలీసుల విచారణలో బయటపడింది. మృతదేహాన్ని కాల్చే సమయంలో చేతులకు పలు గాయాలు కాగా వాటిని గుర్తించిన పోలీసులు.. హత్య కేసులో కొత్త కోణాన్ని కనుక్కున్నారు. కాగా.. మొత్తం ఈ కిరాతక చర్య.. ఉదయం 8 గంటల నుంచి సాయంత్రం 6 గంటల వరకు సాగించినట్లు గురుమూర్తి అంగీకరించాడు. మృతదేహం కాలిపోతున్న సమయంలో వాసనను బయటికి పంపించేందుకు ఫ్యాన్లు పెట్టిన గురుమూర్తి.. ఫ్లాట్ తలుపులు బార్లా తెరిచి ఫ్యాన్లు చేశాడు.