స్థానిక సంస్థల ఎన్నికలు..? టెన్షన్లో బీఆర్ఎస్..

కారు పార్టీలో ఏం జరుగుతోంది? ఎందుకు హైకమాండ్ టెన్షన్ పడుతోంది? స్థానిక సంస్థల ఎన్నికల సమయం దగ్గరపడుతున్న కొద్దీ భయం వెంటాడుతోందా? అందుకే కేటీఆర్ కంటిన్యూగా సమావేశాలు పెడుతున్నారా? అవుననే అంటున్నాయి ఆ పార్టీ వర్గాలు.

 

అధికారం పోయిన తర్వాత బీఆర్ఎస్ పార్టీ పడుతున్న కష్టాలు అన్నీఇన్నీ కావు. స్థానిక సంస్థల ఎన్నికలకు రాజకీయ పార్టీలు రెడీ అవుతున్నాయి. ఎప్పుడొచ్చినా ఎన్నికలకు సిద్ధమేనంటూ అధికార పార్టీ చెబుతోంది. తాము సిద్ధమేనని విపక్షం చెబుతున్నా, ఎక్కడో డౌట్ మాత్రం నేతలను వెంటాడుతోంది. పార్టీలో జరుగుతున్న వరుస పరిణామాల నేపథ్యంలో అటువైపు ఎవరూ కన్నెత్తి చూసే సాహసం చేయలేకపోతున్నారు.

 

ఈ మధ్యకాలంలో వరుసగా ఓవైపు నేతలు, మరోవైపు కార్యకర్తలు, మరోవైపు వివిధ విభాగాలతో భేటీలు, సమావేశాలు నిర్వహిస్తున్నారు వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్. ఒకవిధంగా చెప్పాలంటే వారిని కాపాడుకునేందుకు నానాతంటాలు పడుతున్నారు. వారిలో ఉత్సాహం నింపేందుకు తనవంతు కృషి చేస్తున్నారు.

 

ప్రస్తుతం ఆ పార్టీకి వలస భయం వెంటాడుతోంది. పరిస్థితి గమనించిన వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్, నేతలు, కార్యకర్తలను కాపాడుకునే ప్రయత్నం చేస్తున్నారు. అది ఎంతవరకు సక్సెస్ అవుతుందనే అసలు ప్రశ్న. రాబోయే రోజుల్లో బీఆర్ఎస్‌కు లైఫ్ లేదని భావించిన 10 మంది ఎమ్మెల్యేలు కాంగ్రెస్ కండువా కప్పుకున్నారు. మరికొందరు సైతం అదే బాటలో ఉన్నట్లు సమాచారం.

 

ఇదే ఒరవడి కంటిన్యూ అయితే కేడర్ డీలా పడే ఛాన్స్ ఉందని భావిస్తున్నారు. నేతలు వలసపోతే పార్టీకి ఇబ్బందులు తప్పవు. దీంతో నేతలు మారకుండా ఉండేందుకు స్కెచ్ వేసింది. కాంగ్రెస్ ప్రభుత్వంపై ప్రజల్లో అసంతృప్తి ఉందని, మళ్లీ బీఆర్ఎస్ వైపు వచ్చేందుకు మొగ్గు చూపుతున్నారంటూ చెప్పే ప్రయత్నం చేస్తున్నారు. చీటికీ మాటికీ మీడియా ముందుకొచ్చి అదే మాట ప్రస్తావిస్తున్నారు కూడా.

 

ఈ ఏడాది చివరలో గ్రేటర్ ఎన్నికలు జరగనున్నాయి. గ్రేటర్‌లో ఒకప్పుడు బలంగా కనిపించేది కారు పార్టీ. కొన్నాళ్లుగా పార్టీ వ్యవహార శైలి, నేతల మాటలు నేతల వల్ల కొంత డ్యామేజ్ జరిగిందని కొందరు నేతలు అంగీకరిస్తున్న సందర్భాలు లేకపోలేదు. ఉన్న నేతలు సైతం అధికార పార్టీ లేదంటే బీజేపీ వైపు చూశారు.. ఇప్పటికీ చూస్తున్నారు కూడా.

 

ఈ క్రమంలో కొత్త పల్లవిని తెరపైకి తెచ్చారట కేటీఆర్. పార్టీ నేతలతో కేసీఆర్ సమావేశమయ్యేందుకు సిద్ధమవుతున్నారంటూ వారికి హామీ ఇచ్చారు. పార్టీ మారి ఆగమాగం కావద్దని అంటున్నారట. ఒక్కమాటలో చెప్పాలంటే వారిని ధైర్యాన్ని నూరుపోయే ప్రయత్నం చేస్తున్నారు. మొత్తానికి ఎన్నికలను ఎదుర్కోవడం, సొంత పార్టీ నేతలను కాపాడుకోవడం కారు పార్టీకి పెద్ద టాస్క్‌గా మారిందనే చెప్పవచ్చు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *