ఏపీలో అధికారం పోయిన తర్వాత వైసీపీ కేడర్ తలో దిక్కు చెదిరిపోతోంది. అధికారంలో ఉన్నప్పుడు ఆ పార్టీ కార్యకర్తలు టీడీపీ కేడర్‌పై దాడులు చేశారు. ప్రస్తుతం అధికారం లేకపోవడంతో ఫ్యాన్ పార్టీ కేడర్.. వీలైతే జనసేన, లేదంటే బీజేపీ వైపు మొగ్గు చూపుతోంది. చేరిన కేడర్‌తో టీడీపీ కార్యకర్తలతో విభేదాలు మొదలయ్యాయి. చివరకు కొట్టుకునే వరకు వచ్చింది. లేటెస్ట్‌గా అనంతపురం జిల్లా ధర్మవరం టౌన్‌లో ఇలాంటి ఘటన చోటు చేసుకుంది.
ఫ్లెక్సీలు కట్టే విషయంలో ధర్మవరంలో టీడీపీ-బీజేపీ కేడర్ మధ్య ఘర్షణ జరిగింది. అది చిలికి చిలికి గాలివానగా మారింది. ఇరువర్గాల మధ్య మాటల యుద్ధానికి దారి తీసింది. ఒకరిపై మరొకరు కర్రలతో దాడులు చేసు కోవడం కలకలం రేపుతోంది. గతంలో వైసీపీ కోసం పని చేసి, ఇప్పుడు బీజేపీలో ఎలా చేరతారని ప్రశ్నిస్తున్నారు టీడీపీ నేతలు.
పార్టీ కేడర్ మధ్య ఘర్షణ విషయం తెలియగానే పోలీసులు అలర్ట్ అయ్యారు. వెంటనే ఘటన జరిగిన ప్రాంతానికి చేరుకున్నారు. బాధ్యులపై విచారణ జరిపించి చర్యలు తీసుకుంటామని తెలిపారు పోలీసులు. ఇంతకీ అసలేం జరిగింది. ఇంకాస్త డీటేల్స్‌లోకి వెళ్దాం.
మంత్రి సత్యకుమార్ సమక్షంలో బీజేపీ తీర్థం పుచ్చుకునేందుకు జమీన్ సిద్ధమయ్యారు. ఈ క్రమంలో ఫ్లెక్సీలను ఏర్పాటు చేశారు. ఆయన చేరికను టీడీపీ కార్యకర్తలు వ్యతిరేకిస్తున్నారు. టీడీపీ నేత శ్రీరామ్ మద్దతుదారులు జమీన్ ఫ్లెక్సీని చించివేశారు. దీంతో ఇరువర్గాల కేడర్ మధ్య ఫైటింగ్ కు దారి తీసింది. ఈ ఘటనలో వాహనాలు ధ్వంసమైనట్లు సమాచారం.