ఈడీకి హైకోర్టు షాక్..?

గత కొన్నేళ్లుగా దేశవ్యాప్తంగా రాజకీయ నేతల్ని, ముఖ్యంగా విపక్షంలో ఉన్న నాయకుల్ని టార్గెట్ చేస్తూ మనీ లాండరింగ్ చట్టాన్ని ప్రయోగిస్తున్న కేంద్ర ప్రభుత్వ దర్యాప్తు సంస్థ ఎన్ ఫోర్స్ మెంట్ డైరెక్టరేట్ కు గట్టి ఎదురుదెబ్బ తగిలింది. ఇప్పటికే తమపై మనీలాండరింగ్ ఆరోపణలు చేయడం, అరెస్టులకు దిగడంపై విపక్ష నేతలు కోర్టుల్ని ఆశ్రయిస్తూనే ఉన్నారు. అయితే తాజాగా ఓ స్తిరాస్తి వ్యాపారి ఆధారాల్లేకుండా ఈడీ తనపై మనీలాండరింగ్ పేరుతో వేధిస్తోందంటూ హైకోర్టును ఆశ్రయించారు.

 

మహారాష్ట్రకు చెందిన ఓ రియల్ ఎస్టేట్ డెవలపర్ పై ఈడీ మనీలాండరింగ్ కింద కేసు నమోదు చేసి విచారణ చేస్తోంది. దీంతో అతను బోంబే హైకోర్టును ఆశ్రయించాడు. రాకేశ్ జైన్‌ అనే స్తిరాస్తి వ్యాపారి తమ మధ్య ఒప్పందాన్ని ఉల్లంఘించి మోసం చేశారంటూ ఆస్తి కొనుగోలుదారు ముంబైలోని సబర్బన్ విలే పార్లే పోలీస్ స్టేషన్‌లో ఇచ్చిన ఫిర్యాదు ఆధారంగా ఈడీ మనీలాండరింగ్ దర్యాప్తును ప్రారంభించింది. దీనిపై విచారణ జరిపిన హైకోర్టు.. తగిన ఆధారాల్లేకుండా ఈడీ మనీలాండరింగ్ పేరుతో విచారణ జరుపుతున్నట్లు తేల్చింది. ఆధారాల్లేకుండా వేధించినందుకు లక్ష రూపాయల జరిమానా విధించిన హైకోర్టు.. ఈడీ తీరుపై తీవ్ర వ్యాఖ్యలు చేసింది.

 

కేంద్ర ఏజెన్సీలు చట్ట పరిధిలో తమ విధులు నిర్వహించాలని బోంబే హైకోర్టు తేల్చిచెప్పింది. దేశంలో పౌరులు వేధింపులకు గురికాకుండా చూసేందుకు చట్టాన్ని అమలు చేసే సంస్థలకు బలమైన సందేశం పంపాల్సిన అవసరం ఉందని తెలిపారు. సదరు వ్యాపారికి ఈడీ జారీ చేసిన సమన్లను బోంబే హైకోర్టు రద్దు చేసింది. ఈడీ వంటి కేంద్ర సంస్థలు చట్టాన్ని చేతుల్లోకి తీసుకోవడం, పౌరులను వేధించడం ఆపాల్సిన సమయం వచ్చిందంటూ వ్యాఖ్యానించింది. పిటిషనర్ కు అయిన కోర్టు ఖర్చుల్ని సైతం చెల్లించాలని తీర్పు ఇచ్చింది. హైకోర్టు లైబ్రరీకి లక్ష జరిమానా వారంలో చెల్లించాలని ఈడీని ఆదేశించింది.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *