హైదరాబాద్ నగరంలో కిడ్నా రాకెట్ కలకలం సృష్టించింది. సరూర్ నగర్ డివిజన్‌లోని అలకనంద మల్టీ స్పెషాలిటీ ఆస్పత్రిని అధికారులు సీజ్ చేశారు. అనుమతి లేకుండా ఆస్పత్రి నిర్వహణ, కిడ్నీ మార్పిడి శస్త్ర చికిత్సలు జరుగుతున్నాయని సమాచారం అందడంతో మంగళవారం సాయంత్రం ఎల్బీనగర్ ఏసీపీ కృష్ణయ్య, డీఎంహెచ్ఓ వెంకటేశ్వర్లు ఆస్పత్రిలో తనిఖీలు చేపట్టారు.
ఇతర రాష్ట్రాలకు చెందిన అమాయకులను డబ్బులు ఆశ చూపి, ఇతర ప్రాంతాల నుంచి డాక్టర్లను తీసుకొచ్చి కిడ్నీ మార్పిడి చికిత్సల ద్వారా సొమ్ము చేసుకుంటున్నారు. ఓ కిడ్నీకి రూ. 50 లక్షల వరకు విక్రయిస్తున్నట్లు సమాచారం. ఈ విషయంపై సమాచారం అందడంతో వైద్యారోగ్య శాఖ అధికారులు ఆస్పత్రికి చేరుకుని పోలీసుల సహకారంతో తనిఖీలు నిర్వహించారు.
అలకనంద ఆస్పత్రిలో తమిళనాడుకు చెందిన ఇద్దరు, కర్ణాటక రాష్ట్రానికి చెందిన ఇద్దరికి కిడ్నీ మార్పిడి చేసినట్లు పోలీసులు గుర్తించారు. తమిళనాడుకు చెందిన ఇద్దరు మహిళలు కిడ్నీలు ఇవ్వగా.. వాటిని కర్ణాటకకు చెందిన ఇద్దరు రోగులకు అమర్చినట్లు దర్యాప్తులో తేల్చారు. కిడ్నీ దాతలతోపాటు ఇద్దరు రోగులను, 4 అంబులెన్స్ లను సికింద్రాబాద్ ఆస్పత్రికి తరలించారు పోలీసులు.
ఆరు నెలల క్రితమే అలకనంద ఆస్పత్రి ప్రారంభమైందని, ఇద్దరు వైద్యులతో చిన్న చిన్న ఆపరేషన్లకు మాత్రమే అనుమతి ఉన్నట్లు పోలీసులు తెలిపారు. ఇటీవలే ఇద్దరికి కిడ్నీ మార్పిడి జరగడంతో రోగులు అనారోగ్యానికి గురికాకుండా ముందు జాగ్రత్త చర్యగా సికింద్రాబాద్ గాంధీ ఆస్పత్రికి తరలించినట్లు వెల్లడించారు. ఆస్పత్రి ఎండీ సుమంత్ చారీ, ఆస్పత్రి సిబ్బందిని అరెస్ట్ చేసినట్లు సరూర్ నగర్ పోలీసులు తెలిపారు.
కాగా, తాజా కిడ్నీ మార్పిడి ఆపరేషన్లను హైదరాబాద్ యూరాజిలిస్టులే చేసినట్లు తెలిసింది. మరోవైపు, అలకనంద ఆస్పత్రి వ్యవహారంపై వైద్యారోగ్యశాఖ మంత్రి దామోదర రాజనర్సింహ ఆరా తీశారు. ఇలాంటి చర్యలు పాల్పడినవారిని కఠినంగా శిక్షించాలని ఆదేశించారు. అనుమతులు లేకుండా ఆస్పత్రులు నిర్వహించిన, ఆపరేషన్లు చేసినా కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు.