రఘురామ కేసులో బిగ్ ట్విస్ట్..?

ఏపీలో గత వైసీపీ ప్రభుత్వంలో రెబెల్ ఎంపీగా ఉన్న ప్రస్తుత అసెంబ్లీ డిప్యూటీ స్పీకర్ రఘురామకృష్ణంరాజుపై అప్పట్లో సీఐడీ కస్టడీలో జరిగిన దాడి వ్యవహారంలో మరో ట్విస్ట్ ఎదురైంది. అప్పట్లో రఘురామరాజుపై కస్టడీలో దాడి సందర్భంగా ఆయన గుండెలపై కూర్చున్నట్లు ఆరోపణలు ఎదుర్కొంటున్న టీడీపీ నేత కామేపల్లి తులసిబాబు హైకోర్టులో తాజాగా వినిపించిన వాదన కీలకంగా మారింది. దీంతో హైకోర్టు ఆయన బెయిల్ పై తీసుకోబోయే నిర్ణయం ఇందులో వాస్తవంపై ఆధారపడనుంది.

 

గతంలో సీఐడీ కస్టడీలో ముసుగేసుకుని వచ్చిన కామేపల్లి తులసిబాబు తన గుండెలపై కూర్చుని బెదిరించాడంటూ రఘురామరాజు చేసిన ఆరోపణలు ఇప్పుడు అతని బెయిల్ కు కీలకంగా మారాయి. అయితే ఈ దాడిలో తాను అసలు లేనని, ముసుగు వేసుకుని వచ్చింది తానే అని ఎత్తు, బరువు చూసి అపోహ పడుతున్నారని తులసిబాబు వాదించాడు. రఘురామ వాదనకు ఆధారాలు లేనందున ప్రస్తుతం జ్యుడిషియల్ కస్టడీలో ఉన్న తమ క్లయింట్ తులసిబాబుకు బెయిల్ ఇవ్వాలని ఆయన లాయర్లు కోరారు.

 

అప్పట్లో నలుగురు వ్యక్తులు ముగుసులు వేసుకుని వచ్చి తనపై దాడి చేశారని రఘురామరాజు పోలీసులకు ఇచ్చిన ఫిర్యాదులో పేర్కొన్నారు. అందులో కామేపల్లి తులసిబాబు ఒకరనే అనుమానంతో పోలీసులు ఆయన్ను ప్రకాశం జిల్లా ఎస్పీ ఆఫీసుకు పిలిపించి విచారణ తర్వాత అరెస్టు చేసి జైలుకు పంపారు. అయితే రఘురామ ఆయన్ను గుర్తించారా లేదా అన్నది తెలియ రాలేదు. ఇప్పుడు రఘురామ కేవలం తన ఎత్తు, బరువు ఆధారంగా అలా అనుకుంటున్నారంటూ తులసిబాబు చేస్తున్న వాదనపై హైకోర్టు తీసుకునే నిర్ణయం ఆయన బెయిల్ కు కీలకంగా మారింది.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *