అమరావతి: కరోనా థర్డ్‌వేవ్‌పై సీఎం సమీక్ష నిర్వహించారు. మూడో వేవ్‌పై అనాలసిస్, డేటాలను సీఎంకు అధికారులు వివరించారు. థర్డ్ వేవ్ వస్తుందా? లేదా? అన్నదానిపై శాస్త్రీయ నిర్ధారణ లేదని ఈ సందర్భంగా సీఎం జగన్‌కు అధికారులు వెల్లడించారు. ఒకవేళ థర్డ్ వేవ్ వస్తే తలెత్తే పరిణామాలు, ప్రభావితమయ్యే వారి వివరాలపై అంచనాలను జగన్‌కి వివరించారు. పోషకాహార కార్యక్రమం కొనసాగాలని, టీకాల కార్యక్రమం కూడా కొనసాగించాలని అధికారులు కోరారు. వినియోగించాల్సిన మందులు, పరికరాలు, బయోమెడికల్ ఎక్విప్‌మెంట్, తదితర అంశాలపైనా ముఖ్యమంత్రితో అధికారులు చర్చించారు.
థర్డ్‌వేవ్ వస్తే పిల్లలపై ప్రభావం, తీవ్రత ఎలా ఉంటుందనే అంశాలపై తల్లిదండ్రులకు అవగాహన కల్పించాలని అధికారులకు సీఎం జగన్ సూచించారు. పీడియాట్రిక్ సింప్టమ్స్‌ను గుర్తించడానికి ఆశా, ఆరోగ్య కార్యకర్తలకు శిక్షణ ఇవ్వాలన్నారు. అన్ని టీచింగ్ ఆస్పత్రుల్లో పీడియాట్రిక్ వార్డులు ఏర్పాటు చేయాలని ఆదేశించారు. థర్డ్‌వేవ్ వస్తుందనుకుని కావాల్సిన మందులు ముందే తెచ్చి పెట్టుకోవాలని అధికారులకు సీఎం తెలిపారు. పిల్లల డాక్టర్లను గుర్తించాలని, వారిని రిక్రూట్ చేయడానికి చర్యలు తీసుకోవాలని అధికారులకు సూచించారు.
చిన్న పిల్లల కోసం మూడు నూతన ఆస్పత్రులు నిర్మించాలని, వాటిలో అత్యుత్తమ వైద్య సేవలు అందించడానికి ఏర్పాట్లు చేయాలని చెప్పారు. ఒకటి వైజాగ్‌లో, రెండోది కృష్ణా-గుంటూరు ప్రాంతంలో, మూడోది తిరుపతిలో అత్యుత్తమ పీడియాట్రిక్ కేర్ సెంటర్‌లను ఏర్పాటు చేయాలన్నారు. దాదాపు రూ.180 కోట్ల చొప్పున ఒక్కో ఆస్పత్రి నిర్మాణానికి ప్రణాళిక సిద్ధం చేయాలని అధికారులకు సీఎం జగన్ ఆదేశించారు.