హైదరాబాద్: పరిశుభ్రమైన, నాణ్యమైన మాంసాన్ని ఉత్పత్తి చేయాలనే లక్ష్యంతో చెంగిచెర్ల లో ఏర్పాటు చేసిన ఆధునిక పశువధశాల (స్లాటర్ హౌస్) పరిధిలోని మొండె దారులు (గొర్రెలు, మేకల విక్రయదారుల) సమస్యల పరిష్కారానికి చర్యలు తీసుకుంటామని పశుసంవర్ధక, మత్స్య, పాడి పరిశ్రమల అభివృద్ధి, సినిమాటోగ్రఫీ శాఖల మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ హామీ ఇచ్చారు. సోమవారం బోడుప్పల్ కార్పొరేటర్ బింగి జంగయ్య యాదవ్, లీగల్ అడ్వైజర్ శేఖర్ యాదవ్, మొండె దారుల సంఘం అధ్యక్షులు నవీన్ యాదవ్, జాల నరసింహ యాదవ్ ల ఆధ్వర్యంలో మొండె దారులు మాసాబ్ ట్యాంక్ లోని కార్యాలయంలో మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ ను కలిసి పలు సమస్యలను విన్నవించారు.
ఈ సందర్భంగా మంత్రి పశుసంవర్ధక శాఖ కార్యదర్శి అనిత రాజేంద్ర, గొర్రెలు, మేకల అభివృద్ధి సహకార సమాఖ్య ఎండి రాంచందర్, డైరెక్టర్ లక్ష్మారెడ్డి లతో కలిసి మొండె దార్ల తో నిర్వహించిన సమావేశంలో మంత్రి మాట్లాడుతూ షెడ్ ల నిర్మాణం, త్రాగు నీటి సరఫరా, టాయి లెట్స్ నిర్మాణం వంటి పలు సమస్యలపై అవసరమైన చర్యలు తీసుకోవాలని మంత్రి సంబంధిత అధికారులను ఆదేశించారు. పరిసరాల పరిశుభ్రంగా ఉండేలా జాగ్రత్తలు తీసుకోవాలని సూచించారు. అదేవిధంగా నిరంతరణ పర్యవేక్షణ కోసం సీసీ కెమెరాలను ఏర్పాటు చేయడం జరుగుతుందని మంత్రి చెప్పారు.