తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి మంగళవారం ఢిల్లీ బయల్దేరి వెళ్లారు. ఏఐసీసీ కార్యాలయం ప్రారంభోత్సవంలో ఆయన పాల్గొంటారు. సీఎం రేవంత్ తోపాటు టీపీసీసీ చీఫ్ మహేశ్ కుమార్ గౌడ్, మంత్రులు, కాంగ్రెస్ సీనియర్ నేతలు కూడా ఢిల్లీకి వెళ్లారు. బుధవారం ఏఐసీసీ కార్యాలయం ప్రారంభోత్సవం అనంతరం సీఎం రేవంత్, పీసీసీ అధ్యక్షుడు మహేశ్ కుమార్ ఏఐసీసీ పెద్దలను కలిసే అవకాశం ఉంది.
తెలంగాణ మంత్రివర్గ విస్తరణ, నామినేటెడ్ పోస్టుల భర్తీ, పీసీసీ కార్యవర్గ కూర్పుపై చర్చించే అవకాశం ఉన్నట్లు కాంగ్రెస్ పార్టీలో చర్చ జరుగుతోంది. మరోవైపు, సీఎం రేవంత్ రెడ్డి, పరిశ్రమల శాఖ మంత్రి శ్రీధర్ బాబు బృందం జనవరి 16న ఢిల్లీ నుంచి సింగపూర్ వెళ్తారు.
జనవరి 19 వరకు సింగపూర్‌లో పర్యటించనుంది. ఈ పర్యటనలో స్కిల్ యూనివర్సిటీలో భాగస్వామ్యంపై ఒప్పందాలు.. పారిశ్రామిక పెట్టుబడులపై సీఎం రేవంత్ టీమ్ చర్చించనుంది. జనవరి 20 నుంచి 22 వరకు సీఎం టీమ్ దావోస్‌లో పర్యటించనుంది.
కాగా, సీఎం రేవంత్ రెడ్డి ఢిల్లీకి వెళ్లిన ప్రతిసారి మంత్రివర్గ విస్తరణపై చర్చ జరగడం సాధారణమైపోయింది. ఇప్పటివరకు పలుమార్లు సీఎం రేవంత్ రెడ్డి ఢిల్లీ వెళ్లిన విషయం తెలిసిందే. అధిష్టానం పెద్దలతోనూ చర్చలు జరిపారు. అయితే, ఇప్పటి వరకు మంత్రివర్గం విస్తరణ జరగలేదు. దీంతో మంత్రివర్గ విస్తరణ కోసం కాంగ్రెస్ పార్టీలోని సీనియర్ నేతలు, ఎమ్మెల్యేలు ఎదురుచూపులకు తెరపడటం లేదు. మరోవైపు, బీఆర్ఎస్ పార్టీ నుంచి కాంగ్రెస్ పార్టీలో చేరిన కొందరు ఎమ్మెల్యేలు కూడా మంత్రి పదవుల కోసం ఎదురుచూస్తున్నారు.