ఏపీ ప్రజలకు సంక్రాంతి పండుగ సందర్భంగా గుడ్ న్యూస్ చెప్పింది కూటమి ప్రభుత్వం. ఇప్పటికే ఎన్నికల సమయంలో ఇచ్చిన సూపర్ సిక్స్ హామీలను నెరవేర్చేందుకు ప్రభుత్వం ముందడుగు వేస్తున్న విషయం తెలిసిందే. సూపర్ సిక్స్ లో ప్రధానంగా దీపం 2.0 పథకాన్ని దీపావళి నాడు అమల్లోకి తెచ్చింది. సీఎం చంద్రబాబు నాయుడు ఈ పథకాన్ని ప్రతిష్టాత్మకంగా భావించి, అర్హులకు తప్పనిసరిగా పథక లబ్ధి చేకూరాలని ఆదేశాలు సైతం జారీ చేశారు. ఈ పథకం అమలు గురించి ఇప్పటికే ఏపీ ప్రజలు హర్షం వ్యక్తం చేస్తున్నారు. తాజాగా దీపం 2.0 పథకంపై మరో కీలక ప్రకటన చేసింది ప్రభుత్వం.
ఏపీ మహిళలకు ఉచితంగా గ్యాస్ సిలిండర్ లను అందజేయాలన్న లక్ష్యంతో కూటమి ప్రభుత్వం అధికారంలోకి రాగానే తొలుత ఈ పథకానికి శ్రీకారం చుట్టింది. దీపం పథకాన్ని ప్రవేశపెట్టిన నాటి టీడీపీ ప్రభుత్వం ఇంటింటికి గ్యాస్ కనెక్షన్లను మంజూరు చేసింది. ఇప్పుడు ఏపీలో అధికారంలో గల ఎన్డీఏ కూటమి ప్రభుత్వం ఏకంగా మూడు సిలిండర్లను ఏడాదికి ఉచితంగా అందిస్తోంది. అయితే ఇప్పటికే ఎందరో లబ్ధిదారులు సిలిండర్లను బుక్ చేసుకొని నగదును సైతం అందుకున్నారు. పేద ప్రజలకు మేలు చేకూర్చాలన్న లక్ష్యంతో ప్రభుత్వం ముందుగా ఈ పథకాన్ని అమలు చేసిందని చెప్పవచ్చు.
సిలిండర్ డెలివరీ సమయంలో నగదును చెల్లించడం, ఆ తర్వాత 24 గంటల్లోగా ఆ నగదు లబ్ధిదారునికి జమ కావడం ఈ పథకంలోని ప్రధానాంశం. ఇప్పటికీ మొదటి ఉచిత సిలిండర్ ను పొందని లబ్ధిదారులు మార్చి 31వ తేదీలోగా ఎప్పుడైనా సిలిండర్ను బుక్ చేసుకోవాలని ప్రభుత్వం ప్రకటన విడుదల చేసింది. ఈ పథకం ద్వారా ఒక కోటి 55 లక్షల మంది లబ్ధిదారులలో 91 లక్షల మందికి ప్రయోజనం కలిగిందని ప్రభుత్వం తెలిపింది. మరి మీరు మొదటి ఉచిత సిలిండర్ ఇంకా పొందలేదా.. అయితే మార్చి 31 లోగా సిలిండర్ బుక్ చేసుకోండి.. దీపం 2.0 పథకంతో లబ్ధి పొందండి.