ఏపీలో సంక్రాంతి ఉత్సవాలు ఉత్సాహంగా కొనసాగుతున్నాయి. సంక్రాంతి పండుగ సందర్భంగా రాష్ట్రవ్యాప్తంగా కోడి పందేలు, బెట్టింగ్ పోటీలు, ఇతర జూద క్రీడలు సంచలనం సృష్టిస్తున్నాయి. హైకోర్టు ఆదేశాలను విస్మరించి, నిషేధాన్ని పక్కన పెట్టి, కోళ్లకు కత్తులు కట్టి పందేలు నిర్వహిస్తున్నారు. ఈ కోడి పందేలలో కోళ్లు ఢీ అంటే ఢీ, సై అంటే సై అంటూ తలపడుతున్నాయి. ఈ సందర్భంలో కోడి పందేలు సందర్శించడానికి వచ్చిన ప్రజల కోసం ప్రత్యక్ష ప్రసారాలు ఏర్పాటు చేయడం, నగదు, స్పాట్ క్యాష్ సౌకర్యాలు అందించడం వంటి ఏర్పాట్లు కూడా చేశారు.
కోట్ల రూపాయల నగదు : సంక్రాంతి పండగ తొలిరోజున రాష్ట్రవ్యాప్తంగా కోటి రూపాయల పైగా నగదు చేతులు మారినట్లు అంచనా వేయబడింది. ఈ పోటీలను చూసేందుకు ఇతర రాష్ట్రాల నుంచి భారీ సంఖ్యలో ఔత్సాహికులు తరలివచ్చారు. పందేలతో పాటు గుండాటలు, జూదం వంటి వివిధ బెట్టింగ్ కార్యకలాపాలు కూడా సాగుతున్నాయి. ఈ పోటీలను మరింత ఆకర్షించేందుకు, ప్రత్యేక వాహన పార్కింగ్, భోజనాలు, అధునిక వసతులతో ప్రత్యేక గ్యాలరీలను ఏర్పాటు చేశారు. చాలామంది గెలిచిన వారికి భారీ బహుమతులు కూడా అందిస్తున్నారు.
బహుమతుల జోరు: కాకినాడ జిల్లా కరప మండలం పెనుగుదురు గ్రామంలో కోడి పందేల నిర్వహకులు బంపర్ ఆఫర్ ప్రకటించారు. విజేతలకు రూ.25 లక్షల విలువైన మహీంద్రా థార్ వాహనాన్ని బహుమతిగా ఇస్తామని ప్రకటన చేశారు. మూడు రోజులపాటు జరుగుతున్న ఈ పోటీలలో దాదాపు రూ.5 కోట్ల పందేలు జరిగే అవకాశం ఉందని నిర్వాహకులు అంచనా వేస్తున్నారు. మరోవైపు.. ఏలూరు జిల్లా రామానుజపురంలో నిర్వహించిన కోడి పందేళ్లలో గెలిచిన వారికి రాయల్ ఎన్‌ఫీల్డ్ బైకులు బహుమతిగా ఇచ్చారు.
పశ్చిమ గోదావరి జిల్లాలో ఈ కోడి పందేలు హోరెత్తిస్తున్నాయి. ఇతర జిల్లాలు, రాష్ట్రాల నుంచి ప్రత్యేక విమానాల్లో పందెం రాయుళ్లు పెద్ద సంఖ్యలో ఈ పోటీలను సందర్శించడానికి చేరుకున్నారు. ముఖ్యంగా హైదారాబాద్, బెంగళూరు, చెన్నై నుంచి కోడి పుంజులతో బెట్టింగ్ రాయుళ్లు పెద్ద సంఖ్యలో ఈ పోటీల్లో పాల్గొనేందుకు వచ్చారు. రాత్రి వేళలలో భారీ ఎల్‌ఈడీ స్క్రీన్లు, ఫ్లడ్ లైట్లు ఏర్పాటు చేయడం ద్వారా జాతర వాతావరణం సృష్టించారు. పెదఅమిరం, డేగాపురం, సీసలి, నౌడూరు వంటి ప్రాంతాలలో కోడి పందేలు నిర్వహించిన బరులు మినీ స్టేడియంలా మారాయి. ఈ పోటీల్లో 10 లక్షల రూపాయల నుంచి 25 లక్షల వరకు పందేలు నిర్వహించారు. కొత్తపాడు వద్ద వైఎస్సార్సీపీ నాయకులు కొంతసేపు బరుల వద్ద హడావుడి చేయడంతో అక్కడ కొంత ఉద్రిక్త వాతావరణం ఏర్పడింది.
మరికొన్ని చోట్ల, ప్రజాప్రతినిధులు స్వయంగా బరుల వద్దకు వచ్చి కోళ్లను దువ్వి జోరును మరింత పెంచారు. వేల సంఖ్యలో ఔత్సాహికులు కార్లలో వచ్చి ఈ పందేలను చూసేందుకు, ఆడేందుకు తరలివచ్చారు. భీమవరం, వీరవాసరం, పోలవరం మండలాల్లోని కొన్ని బరుల వద్ద బుల్లెట్ బైకులు, బంగారాన్ని బహుమతులుగా ప్రకటించారు.