సీఎం చంద్రబాబు కొత్త కాన్సెప్ట్.. ఏంటంటే..?

సంక్రాంతి పండగను పురస్కరించుకుని ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు రాష్ట్ర ప్రజలకు బహిరంగ లేఖ రాశారు. ప్రపంచవ్యాప్తంగా ఉన్న తెలుగు వారికి, దేశవిదేశాల నుంచి జన్మభూమికి వచ్చి బంధుమిత్రులతో సంక్రాంతి పండుగ జరుపుకుంటున్న వారందరికీ శుభాకాంక్షలను తెలియజేశారు. ప్రతి ఇంట్లో పండుగ శోభ వికసించాలని ఆకాంక్షించారు.

 

పబ్లిక్ -ప్రైవేట్- పీపుల్-పార్ట్‌నర్‌షిప్

 

ఆర్థిక అసమానతలు తొలగిపోయి, సమాజంలో ప్రతి ఒక్కరి జీవన ప్రమాణాలు మెరుగుపడినప్పుడే అందరి ఇళ్లలో సుఖసంతోషాలు వెల్లివిరుస్తాయని తాను మనస్ఫూర్తిగా నమ్ముతున్నానని అన్నారు. ఇందులో భాగంగా తాను ప్రతిపాదించిన P4 (పబ్లిక్ -ప్రైవేట్- పీపుల్-పార్ట్‌నర్‌షిప్) విధానంలో భాగస్వాములు అవ్వాలని పిలుపునిచ్చారు.

 

ఆరోగ్యం, ఆదాయం, ఆనంద ఆంధ్రప్రదేశ్

 

ఆరోగ్యం, ఆదాయం, ఆనంద ఆంధ్రప్రదేశ్ కోసం ప్రతి ఒక్కరూ సంకల్పం తీసుకుందామని విజ్ఞప్తి చేశారు. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్‌లో 1995లో తాను పబ్లిక్-ప్రైవేట్-పార్ట్‌నర్‌‌షిప్‌ను ప్రతిపాదించానని గుర్తు చేశారు. దీనివల్ల సామాన్య రైతు కుటుంబం నుంచి వచ్చిన వాళ్లు కూడా ఉన్నత స్థానాలకు చేరుకున్నారని, గ్లోబల్ సిటిజన్‌గా, గ్లోబల్ లీడర్లు అవుతున్నారని చెప్పారు.

 

విద్య, వైద్యం, పౌష్టికాహారం..

 

ఇప్పటికీ లక్షల కుటుంబాలు పేదరికంలోనే మగ్గుతున్నాయని, కేంద్ర ప్రభుత్వ గణాంకాల ప్రకారం ఏపీలో గ్రామీణ, పట్టణ ప్రాంతాల్లో ఎంతో మంది కటిక పేదరికంలో ఉన్నారని చెప్పారు. వారికి విద్య, వైద్యం, పౌష్టికాహారం, మంచినీరు.. వంటి కనీస అవసరాలకు కూడా నోచుకోలేకపోతున్నారని చంద్రబాబు ఆవేదన వ్యక్తం చేశారు.

 

పీ4 విధాన పత్రం..

 

ఈ పరిస్థితిని సమూలంగా మార్చేయడానికి, సమాజాన్ని శక్తిమంతంగా తీర్చిదిద్దడానికి పీ4 విధాన పత్రాన్ని ఆవిష్కరిస్తోన్నానని చంద్రబాబు పేర్కొన్నారు. అత్యున్నత స్థానాలకు చేరుకున్న 10 శాతం మంది ప్రజలు.. అట్టడుగున ఉన్న 20 శాతం మందికి చేయూతనివ్వాలని కోరుతున్నానని అన్నారు.

 

సమాజానికి తమవంతు తిరిగి ఇవ్వాలి..

 

పేద వర్గాల చదువులు, ఉపాధి అవకాశాలు, నైపుణ్యం పెంచుకోవడానికి సహకరిస్తే ఆయా కుటుంబాలు అన్ని రకాలుగా నిలబడతాయని చంద్రబాబు చెప్పారు. సమాజంలో తమకు లభించిన అవకాశాలను అందిపుచ్చుకుని ఆయా రంగాల్లో అగ్రస్థానాలకు చేరుకున్న వాళ్లు చాలామంది ఉన్నారని, వాళ్లంతా సమాజానికి తమవంతు తిరిగి ఇవ్వాల్సిన అవసరం ఉందని పేర్కొన్నారు.

 

పేదలకు మెంటార్‌గా..

 

ఉన్నత స్థానాల్లో ఉన్నవాళ్లు, ప్రవాస భారతీయులు తమకు తెలిసిన పేదలకు మెంటార్‌గా వ్యవహరించాలని, వారికి అవకాశాలను కల్పించాలని, అండగా ఉండాలని చంద్రబాబు విజ్ఞప్తి చేశారు. దీనివల్ల సమాజంలో పెనుమార్పులను తీసుకుని రావొచ్చని అభిప్రాయపడ్డారు.

 

ఎన్‌ఆర్‌ఐలు, పారిశ్రామికవేత్తలు..

 

గతంలో జన్మభూమి స్ఫూర్తితో ఇచ్చిన పిలుపుతో ఎన్‌ఆర్‌ఐలు, పారిశ్రామికవేత్తలు పెద్ద ఎత్తున ముందుకొచ్చారని, అనేక గ్రామాల రూపురేఖలను మార్చారని చంద్రబాబు గుర్తుచేశారు. ఇప్పుడూ అదే స్ఫూర్తితో అట్టడుగున ఉన్న పేదలకు అవకాశాలు కల్పించి, వారిని పైకి తీసుకుని రావాలని పిలుపునిస్తున్నానని అన్నారు.

 

ప్రత్యేకంగా ఓ పోర్టల్‌..

 

పీ4 విధానంపై ప్రతి ఒక్కరి సలహాలు, అనుభవాలు, ఆలోచనలు, సూచనలను స్వీకరించడానికి తాము సిద్ధంగా ఉన్నామని చంద్రబాబు చెప్పారు. దీనికోసం ప్రత్యేకంగా ఓ పోర్టల్‌ను తీసుకు వస్తామని, 30 రోజుల పాటు ప్రతి ఒక్కరి ఆలోచనలను స్వీకరిస్తామని పేర్కొన్నారు. ప్రజల భాగస్వామ్యంతో జీరో పావర్టీని సాధిద్దామని అన్నారు. తెలుగు జాతిని నంబర్ 1 చేసే క్రమంలో ప్రతి ఒక్కరు భాగస్వామ్యులు కావాలని కోరారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *