దిల్లీ మద్యం పాలసీలో రూ.2,026 కోట్ల కుంభకోణం.. కాగ్ సంచలన రిపోర్ట్ వెల్లడి..

దేశంలో తీవ్ర చర్చనీయాంశమైన దిల్లీ మద్యం పాలసీపై కీలక నివేదిక వెలుగులోకి వచ్చింది. ఈ పాలసీ రూపకల్పన, అమలు ద్వారా ప్రభుత్వానికి రూ.2,026 కోట్ల భారీ నష్టం వచ్చిందంటూ కంప్ట్రోలర్ అండ్ ఆడిటర్ జనరల్ – కాగ్ నివేదిక వెల్లడించింది. కాగ్ నివేదిక లీకైనట్లు పేర్కొంటూ.. జాతీయ మీడియా అనేక కథనాలు ప్రచురిస్తున్నాయి. వాటి ప్రకారం.. రాజ్యంగబద్ధ సంస్థ కాగ్..దిల్లీ మద్యం పాలసీలోని లోపాల్ని ఎత్తిచూపిందని, దీని కారణంగా ప్రభుత్వానికి జరిగిన నష్టాన్ని స్పష్టంగా వివరించింది అని తెలుపుతున్నాయి.

 

నిర్ణీత ప్రక్రియను పక్కదారి పట్టిస్తూ, కొన్ని సంస్థలకు కావాలని ప్రయోజనం చేకూరేలా ప్రభుత్వం వ్యవహరించిందంటూ వెల్లడించింది. విధివిధాన రూపకల్పనలో స్పష్టమైన లోపాలు, విధానపరమైన ఉల్లంఘనలు, సందేహాస్పద నిర్ణయాలు స్పష్టంగా కనిపిస్తున్నాయని కాగ్ నివేదిక వెల్లడించింది.

 

దిల్లోలో అప్పటికే అమలవుతున్న మద్యం పాలసీని పూర్తిగా మార్చేస్తూ.. ఆమ్ ఆద్మీ పార్టీ 2021 నవంబర్ లో నూతన మద్యం పాలసీని అమల్లోకి తీసుకువచ్చింది. దీని ద్వారా ప్రభుత్వానికి ఆదాయం పెంచడం, మద్యం వ్యాపారాన్ని సులభతరం చేయడమే లక్ష్యమని ప్రకటించింది. కానీ.. వాస్తవంలో మాత్రమే అనేక ఆరోపణలు ఎదుర్కొంది. పాలసీ రూపకల్పన వెనుకే పెద్ద కుట్ర ఉందని అనేక పార్టీలు, నేతలు ఆరోపించగా.. అవినీతి, ఆర్థిక అవకతవకలు జరిగాయంటూ… ఎన్ ఫోర్స్ మెంట్ డైరెక్టరేట్, సీబీఐ వంటి దర్యాప్తు సంస్థలు కేసులు నమోదు చేశాయి.

 

అలాగే.. నూతన మద్యం పాలసీ ద్వారా నిర్దేశించుకున్న లక్ష్యాలను చేరుకోవడంలో దిల్లీ ప్రభుత్వం

విఫలమైందని కాగ్ స్పష్టం చేసింది. కొత్త పాలసీ రూపకల్పన చేస్తున్నప్పుడు నిపుణుల కమిటీ సిఫార్సులను పట్టించుకోలేదని వెల్లడించింది. అప్పటి డిప్యూటీ సీఎం మనీశ్‌ సిసోదియా నేతృత్వంలోని మంత్రుల బృందం.. కీలక నిర్ణయాలు తీసుకునే సమయంలో మంత్రిమండలి, లెఫ్టినెంట్ గవర్నర్‌ ఆమోదం కూడా తీసుకోలేదని వెల్లడించింది.

కొత్త నిబంధనల ధృవీకరణ కోసం దిల్లీ అసెంబ్లీ ముందు సైతం ఈ బిల్లును సమర్పించలేదన్న కాగ్ రిపోర్టు.. ఇది ప్రామాణిక ప్రోటోకాల్ ను స్పష్టంగా ఉల్లంఘించడమే అని తెలిపింది.ఈ పాలసీలోని లోపాల కారణంగా.. ఆమ్ ఆద్మీ పార్టీ నాయకులు కొందరు లాభపడ్డారని కాగ్ ఆరోపించింది.

 

లైసెన్సుల జారీ, పునరుద్ధరణలో జరిగిన అవకతవకలపై కాగ్ నివేదిక స్పష్టమైన అభిప్రాయాన్ని వెల్లడించింది. ఈ ప్రక్రియలో బిడ్లు దాఖలు చేసిన సంస్థల ఆర్థిక పరిస్థితి, వాటిపై గతంలో వచ్చిన ఫిర్యాదుల్ని పట్టించుకోకుడా.. టెండర్ల ప్రక్రియలో పాల్గొనేందుకు అనుమతించినట్లు కాగ్ గుర్తించింది. అలాగే.. ఆర్థికంగా నష్టాల్లో ఉన్న సంస్థలకు సైతం ఆమ్ ఆద్మీ పార్టీ ప్రభుత్వం లైసెన్సులు మంజూరు చేసినట్లు గుర్తించారు. లైసెన్సులు రద్దైన సంస్థలకు ఎలాంటి నిబంధనలు లేకుండానే లైసెన్సులు పునరుద్ధరణ జరిపినట్లు కాగ్ వెల్లడించింది. ఇవ్వన్నీ ఉద్దేశ్యపూర్వకంగానే జరిగినట్లు తెలుస్తోందని కాగ్ రిపోర్టు పేర్కొంది.

 

దిల్లీ ప్రభుత్వం నూతనంగా తీసుకువచ్చిన మద్యం పాలసీ పై జాతీయ స్థాయిలో తీవ్ర విమర్శలు రావడంతో… 2022 సెప్టెంబరు చివరి నాటికి ఆ పాలసీని ప్రభుత్వం ఉపసంహరించుకుంది. కానీ.. ఆ మధ్య కాలంలోనే అనేక అవకతవకలకు పాల్పడ్డారని, మనీలాండరింగ్‌ ద్వారా చట్టాల్ని ఉల్లంఘించారని దర్యాప్తు సంస్థలు గుర్తించాయి. లైసెన్స్‌దారులకు చట్టవిరుద్ధంగా సాయం చేసి, వారి నుంచి పెద్ద మొత్తంలో లంచాలు పొందారని దర్యాప్తు సంస్థలు కేసులు నమోదు చేశాయి.

 

ఈ కుంభకోణంలో భాగంగానే దిల్లీ డిప్యూటీ సీఎం సిసోదియా సహా.. ఆ రాష్ట్ర మాజీ ముఖ్యమంత్రి, ఆమ్ ఆద్మీ పార్టీ జాతీయ కార్యదర్శి కేజ్రీవాల్, సంజయ్ సింగ్ సహా అనేక మంది సీనియర్ ఆమ్ ఆద్మీ పార్టీ నాయకులు అరెస్ట్ అయ్యారు. ప్రస్తుతం వారంతా.. బెయిల్ పై బయట ఉన్నారు. కేసీఆర్ కూతురు, ఎమ్మెల్సీ కవిత కూడా ఇదే కేసులో జైలుకు వెళ్లి వచ్చారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *