సికింద్రాబాద్‌లోని పరేడ్ గ్రౌండ్స్‌లో ఈ నెల 13వ తేదీ నుంచి 15 వరకు అంతర్జాతీయ కైట్ అండ్ స్వీట్ ఫెస్టివల్ జరగనున్నట్లు మంత్రి జూపల్లి కృష్ణారావు తెలిపారు. శనివారం ఆయన మీడియాతో మాట్లాడుతూ.. సంక్రాంతి పండుగను పురస్కరించుకొని కాంగ్రెస్ ప్రజా ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా కైట్ అండ్ స్వీట్ ఫెస్టివల్ నిర్వహిస్తున్నట్లు పేర్కొన్నారు. ఈ ఫెస్టివల్‌లో 20దేశాల సభ్యులు పాల్గొంటారని తెలిపారు. తెలుగు ప్రజలంతా ధాన్యం ఇంటికొచ్చిన సంతోషకర సందర్భంలో ప్రతీ ఏటా మకర సంక్రాంతిని ఘనంగా జరుపుకుంటారని.. అదే విధంగా హైదరాబాద్ నగరంలో సంక్రాంతి వచ్చిందంటే లక్షలాది మంది కైట్ ఫెస్టివల్‌లో పాల్గొని పతంగులు ఎగురవేస్తారన్నారు. అవి చూసేందుకు వచ్చిన వారు కూడా చాలా బాగా ఎంజాయ్ చేస్తారని మంత్రి జూపల్లి తెలిపారు. ఈ కార్యక్రమాలు మూడు రోజుల పాటు జరుగుతాయని, ఎవరైనా పాల్గొనవచ్చన్నారు. సంస్కృతి, సంప్రదాయాలు ప్రతిబింబించేలా ఈ ఫెస్టివల్ ఉంటుందని పేర్కొన్నారు. రాష్ట్రంలోని అన్ని గ్రామాల్లో సంస్కృతి, సంప్రదాయాలు పెంపొందించేలా ఇలాంటి కార్యక్రమాలు చేపడతామని మంత్రి స్పష్టం చేశారు.