సీఎం రేవంత్ రెడ్డి అధ్యక్షతన సచివాలయంలో జిల్లా కలెక్టర్ల సమావేశం జరిగింది. ఈ భేటీలో ముఖ్యమంత్రితో పాటు డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క, మంత్రులు ఉత్తమ్ కుమార్ రెడ్డి, పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి, కోమటిరెడ్డి వెంకటరెడ్డి, శ్రీధర్ బాబు, పొన్నం ప్రభాకర్, సీతక్క, కొండా సురేఖ, జూపల్లి కృష్ణారావు హాజరయ్యారు.
రైతు భరోసా, ఇందిరమ్మ ఆత్మీయ భరోసా, రేషన్ కార్డులు ఇందిరమ్మ ఇండ్ల పథకాల అమలు, లబ్ధిదారుల జాబితా తయారీపై సీఎం చర్చించారు. జనవరి 26 న రిపబ్లిక్ డే నుంచి రైతు భరోసా, ఇందిరమ్మ ఆత్మీయ భరోసా పథకాలను అమలు చేయాలని ప్రభుత్వం ఇప్పటికే నిర్ణయించిన విషయం తెలిసిందే. అయితే కలెక్టర్‌ల సమావేశంలో సీఎం రేవంత్ రెడ్డి ఇటీవల జరుగుతున్న వరుస ఫుడ్ పాయిజన్ ఘటనలపై ఆగ్రహం వ్యక్తం చేశారు. ప్రభుత్వ పాఠశాలలు ,రెసిడెన్షియల్ పాఠశాలలో వరుస ఫుడ్ పాయిజన్ ఘటనలపై సీఎం సీరియస్ అయ్యారు. ప్రభుత్వం డైట్ ఛార్జీలు ,కాస్మోటిక్ ఛార్జీలు పెంచినా ఇలాంటి ఘటనలు జరగడం ప్రభుత్వంకు చెడ్డపేరు తెస్తున్నాయన్నారు. కలెక్టర్‌లు విజిట్ చేయకపోవడమే ఇలాంటి ఘటనలకు ప్రధానం కారణం అవుతున్నాయన్న సీఎం చెప్పారు. ఇక నుంచి ప్రతీ వారం ప్రభుత్వ పాఠశాలలు, రెసిడెన్షియల్ పాఠశాలలో కలెక్టర్‌లు విజిట్ చేసి రిపోర్ట్ ఇవ్వాలని సీఎం ఆదేశాలు జారీ చేశారు.
వ్యవసాయ యోగ్యమైన భూములకు మాత్రమే రైతు భరోసా చెల్లించాలని సీఎం మరోసారి చెప్పారు. వ్యవసాయానికి అక్కరకు రాని భూములకు స్కీం అమలు చేయకూడదని అన్నారు. ‘అలాంటి భూములను గుర్తించి రైతు భరోసా నుంచి మినహాయించాలి. రియల్ భూములు, లే అవుట్ భూములు, నాలా కన్వర్ట్ అయిన భూములు, మైనింగ్ భూములు, గోదాములు నిర్మించిన భూములు, ప్రభుత్వం వివిధ ప్రాజెక్టులకు సేకరించిన భూముల వివరాలను ముందుగా సేకరించాలి. గ్రామ పంచాయతీ, మున్సిపాలిటీల రెవెన్యూ రికార్డులు, సంబంధిత విభాగాల రికార్డులన్నీ క్రోడీకరించుకోవాలి. వీటితోపాటు విలేజ్ మ్యాప్ ల ను పరిశీలించి అధికారులు ఫీల్డ్ కు వెళ్లి వీటిని ధ్రువీకరించుకోవాలి. వ్యవసాయ యోగ్యం కాని భూముల జాబితాలను పక్కాగా తయారు చేసి గ్రామ సభల్లో ప్రచురించాలి. వీటిని గ్రామ సభల్లో చర్చించి వెల్లడించాలి. ఎలాంటి అనుమానాలు అపోహలకు తావు లేదు. రైతు పంట వేసినా.. వేయకున్నా.. వ్యవసాయ యోగ్యమైన ప్రతి ఎకరం భూమికి రైతు భరోసా ఇవ్వాలి’ అని సీఎం రేవంత్ రెడ్డి వ్యాఖ్యానించారు.