ఏపీలో తొలిసారి పడవ పందాలు.. ఎక్కడంటే..?

పొగ మంచుల్లో.. భోగి మంటల్లో.. చుట్టాల పిలుపుల్లో.. మనసారా మాటల్ని కలిపేస్తూ.. అందరినీ ఒక్కటి చేసేదే సంక్రాంతి. ప్రేమానురాగాలతో, ఆప్యాయతలతో గడిపే సంతోష సమయమిది. పండక్కి నవ్వులతో స్వాగతం పలికే ఊళ్లు.. హృదయాల్ని కదిలించే పలకరింపులు, తెలుగు సంప్రదాయాన్ని, తెలుగు వాళ్లందరినీ ఏకం చేసే గొప్ప సంస్కృతి సంక్రాంతి. అందుకోసమే.. ఎక్కడున్నా పండక్కి మనసు ఊరు మీదకు లాగుతుంది. ల్యాగ్ లేకుండా బ్యాగు సర్దుకొని పల్లెకు వెళ్లిపోయేలా చేస్తుంది.

 

ఈ సంక్రాంతి పండుగలో.. కుటుంబ సభ్యులు, స్నేహితులతో సరదాగా గడపడమే కాదు.. కిక్కిచ్చే ఎలిమెంట్స్ ఇంకా చాలానే ఉన్నాయ్. కోళ్ల పందాల్లో.. పందెం పుంజులు చూపే పౌరుషాలు.. తిరునాళ్లు, సంబరాలు.. ఇలా చాలానే ఉంటాయి. ఇవన్నీ.. ఏడాది పాటు మనం పడే కష్టాన్ని మర్చిపోయేలా చేస్తాయి. కొన్ని నెలలకు కావాల్సినన్ని మధుర స్మృతుల్ని మిగులుస్తాయి. 3 రోజులు.. ఆనందోత్సాహాలతో చేసుకునే సంక్రాంతి పండుగ.. ప్రకృతి సౌందర్యాన్ని ఆవిష్కరిస్తుంది. మన తెలుగింటి బంధాల్ని బలపరుస్తుంది. సంక్రాంతి.. మన సంస్కృతీ సంప్రదాయాలకు నిలువుటద్దం. ఆత్మీయతలూ, అనురాగాలకు నిలువెత్తు నిదర్శనం. మొత్తంగా.. సంక్రాంతి పండుగంటే పల్లెలదే.. నూతన సంవత్సరంలో పెద్ద పండుగని.. ఆస్వాదించాలంటే.. అమ్మలాంటి పల్లెకు పోవాల్సిందే!

 

ఆంధ్రాలో ఇప్పటికే సంక్రాంతి సందడి మొదలైంది. ఆత్రేయపురం అంటే పూతరేకులే గుర్తొస్తాయి. బట్ ఫర్ ఏ ఛేంజ్.. ఈ సంక్రాంతి నుంచి.. కేరళ మాదిరి పడవ పోటీలు కూడా గుర్తొస్తాయి. కోనసీమలో లక్షల ఎకరాలకు నీరందించే ప్రధాన కాలువలో నిర్వహించబోయే పడవ పందాలు.. ఈసారి స్పెషల్ ఎట్రాక్షన్‌గా నిలవబోతున్నాయి. కోనసీమ తిరుమలగా పిలవబడే.. వాడపల్లి వెంకటేశ్వరస్వామి ఆలయానికి వెళ్లే మార్గంలో.. ఈ పడవ పోటీలు జరగబోతున్నాయి. ఇకపై.. ప్రతి సంక్రాంతికి కోడి పందాలతో పాటు పడవ పందాలు కూడా నిర్వహిస్తామంటున్నారు నిర్వాహకులు.

 

ఆత్రేయపురంలో జరగబోయే పడవ పోటీలకు.. రాష్ట్రం నలుమూలల నుంచి స్విమ్మర్స్, బోర్డర్స్ వస్తున్నారు. మొత్తం.. ఐదు విభాగాల్లో ఈ పడవ పోటీలు నిర్వహించనున్నారు. సుమారుగా.. ఫోర్ మెన్ డ్రాగన్ బోటింగ్ పోటీల్లో 150 మంది వరకు పాల్గొననున్నారు. అలాగే.. డ్రాగన్ బోట్, కెనోస్ లాలం, కెనోస్ స్ప్రింట్, కెనో పోలో, దివ్యాంగుల కోసం ప్రత్యేకంగా కెనో పారా బోట్స్ విభాగాల్లో.. పడవ పోటీలు జరగనున్నాయి. కృష్ణా జిల్లాలోని మారుమూల పల్లెటూరులోని.. మత్స్యకార కుటుంబం నుంచి వచ్చిన గాయత్రి.. భారత్ తరఫున కెనోస్ లాలం విభాగంలో పోటీ పడి.. ఏడు మెడల్స్ సాధించింది. ఇంతటి ప్రతిభ కలిగిన గాయత్రి.. ఈసారి ఆత్రేయపురం పడవ పోటీల్లో పాల్గొనబోతోంది. పందెం ఎక్కడైనా.. ప్రాక్టీస్ ఒకేలా ఉంటుందని గాయత్రి చెబుతోంది. ఆ అమ్మాయి చేస్తున్న విన్యాసాలు.. అందరినీ కట్టిపడేస్తున్నాయ్.

 

ఇటీవల జరిగిన నేషనల్ ఫోర్ మెన్ డ్రాగన్ బోట్ పందాల్లో.. ఆంధ్రాకు కాంస్య పతకం సాధించిన గిరిబాబు, భాస్కర్ కూడా ఆత్రేయపురం పడవ పోటీల్లో పాల్గొననున్నారు. సాధారణ స్విమ్మర్లుగా ఉండే తమను.. బోట్స్‌మెన్‌గా మార్చిన కోచ్‌ శివారెడ్డికి ప్రత్యేక ధన్యవాదాలు చెబుతున్నారు. కొండల మధ్య నుంచి వచ్చే వాటర్ ఫోర్స్ మధ్యలో చేసే కేనోసాలం బోటింగ్ ప్రాక్టీస్‌కి అనువైన ప్రదేశం.. ఆత్రేయపురం లొల్లలాకుల దగ్గర ఉందంటున్నారు. పోటీలు ముగిసిన తర్వాత.. 15 రోజుల పాటు క్యాంపును ఏర్పాటు చేస్తున్నట్లు కోచ్ శివారెడ్డి తెలిపారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *