భారత ప్రధానమంత్రి నరేంద్ర మోదీ 07-06-2021 జాతినుద్దేశించి ప్రసంగించనున్నారు.

Prime Minister Narendra Modi : భారత ప్రధానమంత్రి నరేంద్ర మోదీ 2021, జూన్ 07వ తేదీ సోమవారం సాయంత్రం 5 గంటలకు జాతినుద్దేశించి ప్రసంగించనున్నారు. దీంతో ఆయన ఏం చెప్పనున్నారనే దానిపై ఉత్కంఠ నెలకొంది. PMO కార్యాలయం ట్వీట్‌ చేసి ఈ విషయాన్ని తెలిపింది. అన్‌లాక్‌ ప్రక్రియ, కరోనా కట్టడి, వ్యాక్సినేషన్ అంశాలపై మోదీ ప్రసంగించే అవకాశం ఉంది. ఇప్పటికే మోదీ పలు రంగాల నిపుణులతో సమావేశాలు నిర్వహించారు. భవిష్యత్తులో తీసుకోవాల్సిన నిర్ణయాలపై చర్చించారు. వ్యాక్సినేషన్‌ పంపిణీ తీరుపై సుప్రీంకోర్టుతో పాటు పలు రాష్ట్రాలు అభ్యంతరం వ్యక్తం చేస్తున్నాయి.

అన్ని వయసుల వారికి ఒకే విధానం అనుసరించాలని కేంద్రానికి సూచించాయి. వ్యాక్సినేషన్‌ ఉచితంగా అందివ్వాలని విపక్షాలు డిమాండ్‌ చేస్తున్న సంగతి తెలిసిందే. దీంతో వ్యాక్సినేషన్‌ ప్రక్రియపై మోదీ కీలక ప్రకటన చేయవచ్చు. దేశవ్యాప్తంగా వ్యాక్సినేషన్‌ పంపిణీ కార్యక్రమాన్ని కేంద్రమే చేపట్టే అవకాశం కనిపిస్తోంది. కేంద్రం పరిశీలనలో ఉన్న ఉద్దీపన ప్యాకేజీలపై స్పష్టత ఇచ్చే అవకాశం ఉంది. థర్డ్ వేవ్ ఎదుర్కోవడానికి దేశాన్ని సిద్ధం చేసే దిశగా దిశానిర్దేశం చేయనున్నారు. కరోనా సెకండ్‌ వేవ్ తగ్గుముఖం పడుతుండడంతో దేశంలో అన్‌లాక్‌ ప్రక్రియ మొదలైంది. ఢిల్లీ, మహారాష్ట్ర, ఉత్తరప్రదేశ్ రాజస్థాన్‌ తదితర రాష్ట్రాలు లాక్‌డౌన్‌ ఆంక్షలను సడలించాయి.

మరికొన్ని రాష్ట్రాలు లాక్‌డౌన్‌ను పొడిగించాయి. అన్‌లాక్‌ ప్రక్రియ మొదలు కానుండడంతో మోదీ ప్రజలను మరింత అప్రమత్తంగా ఉండాలని సూచించే అవకాశం ఉంది. ప్రధాని మోదీ చివరిసారిగా ఏప్రిల్‌ 20న జాతినుద్దేశించి మాట్లాడారు. లాక్‌డౌన్‌ను చివరి అస్త్రంగా మాత్రమే ఉపయోగించాలని రాష్ట్రాలకు సూచించారు. 61 రోజుల తర్వాత దేశంలో కరోనా కేసుల సంఖ తగ్గుముఖం పట్టింది. ఆదివారం లక్ష కేసులకు పైగా నమోదయ్యాయి. మొత్తానికి మోదీ స్పీచ్ పై ఉత్కంఠ నెలకొంది

 

 

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *