టీటీడీ చైర్మన్ బీ.ఆర్ నాయుడు శుక్రవారం మీడియా సమావేశంలో చేసిన వ్యాఖ్యలపై జనసేన పార్టీ నాయకులు, కార్యకర్తలు భగ్గుమన్నారు. తిరుపతి తొక్కిసలాట ఘటనపై టీటీడీ పాలకమండలి సమావేశాన్ని శుక్రవారం చైర్మన్ బీ.ఆర్ నాయుడు అధ్యక్షతన నిర్వహించారు. ఈ సమావేశంలో మృతుల కుటుంబాలకు అండగా నిలుస్తామని టీటీడీ చైర్మన్ బీఆర్ నాయుడు అన్నారు. అలాగే మృతుల కుటుంబ సభ్యుల గృహాల వద్దకు వెళ్లి టీటీడీ చెక్కులను పంపిణీ చేయడం జరుగుతుందని తెలిపారు.
అనంతరం మీడియా ప్రతినిధులతో బీ.ఆర్ నాయుడు మాట్లాడారు. ఓ మీడియా ప్రతినిధి డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ సారీ చెప్పాలంటూ టీటీడీని కోరారు కదా అంటూ ప్రశ్నించగా బీఆర్ నాయుడు విభిన్న రీతిలో స్పందించారు. క్షమాపణ చెప్పడంలో తప్పేం లేదన్న చైర్మన్, ఆ తర్వాత సంచలన వ్యాఖ్యలు చేశారు. క్షమాపణలు చెప్పినంత మాత్రాన చనిపోయిన వారు తిరిగి రారని, ఎవరో ఏదో చెబితే స్పందించాల్సిన అవసరం లేదంటూ రిప్లై ఇచ్చారు. అయితే తొక్కిసలాట ఘటన ఏ విధంగా జరిగింది? ఎలా జరిగిందనే అంశంపై విచారణ జరగాల్సి ఉందన్నారు.
ఈ కామెంట్స్ ఇప్పుడు వివాదానికి దారితీసాయి. డిప్యూటీ సీఎం హోదాలో ఉన్న పవన్ కళ్యాణ్ సారీ చెప్పాలంటూ చేసిన విజ్ఞప్తిపై, చైర్మన్ హోదాలో ఉన్న బీఆర్ నాయుడు ఎవరో ఏదో చెబితే స్పందించాల్సిన అవసరం లేదంటూ కామెంట్ చేయడంతో జనసేన పార్టీ నాయకులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ఈ మేరకు సోషల్ మీడియాలో చైర్మన్ మాట్లాడిన వీడియోలను షేర్ చేస్తూ, ప్రభుత్వం వెంటనే స్పందించి చైర్మన్ పై చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేస్తున్నారు. పవన్ కళ్యాణ్ డిప్యూటీ సీఎం అన్న హోదాను సైతం చైర్మన్ మరచి కామెంట్స్ చేశారని, వెంటనే చైర్మన్ క్షమాపణలు చెప్పాలంటూ జనసేన పార్టీకి చెందిన కొందరు విషయాన్ని సీరియస్ గా తీసుకున్నారు. మరి ఈ కామెంట్స్ పై చైర్మన్ ఏ విధంగా స్పందిస్తారో వేచి చూడాలి.