తెలంగాణ సర్కార్ రైతు భరోసా స్కీమ్ అమలుపై ఇప్పటికే ప్రకటన జారీ చేసిన విషయం విదితమే. సీఎం రేవంత్ రెడ్డి ఇటీవల రైతు భరోసా స్కీమ్ అమలు చేయడంలో ప్రభుత్వం వెనుకడుగు వేసేది లేదని ప్రకటించారు. సాగులో ఉన్న ప్రతిరైతుకు మేలు చేకూర్చాలన్నది తమ కాంగ్రెస్ ప్రభుత్వ లక్ష్యమని సీఎం అన్నారు. సీఎం ప్రకటన సమయం నుండి తెలంగాణ రైతులు ఆనందం వ్యక్తం చేస్తున్నారు. ఇప్పటికే అన్ని జిల్లాల్లో సీఎం చిత్రపటానికి పాలాభిషేకం చేశారు. ఈ నెల 26న రైతు భరోసా పథకానికి శ్రీకారం చుట్టనుంది ప్రభుత్వం. ఈ నేపథ్యంలో మంత్రి తుమ్మల నాగేశ్వరరావు మంగళవారం కీలక ప్రకటన చేశారు.
తెలంగాణలో కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పడిన వెంటనే రుణమాఫీ విజయవంతంగా అమలు చేసిన విషయం తెల్సిందే. ఏకంగా రూ. 2 లక్షల వరకు రుణమాఫీ అమలు కాగా రైతాంగం హర్షం వ్యక్తం చేశారు. ఏడాది పాలనను కాంగ్రెస్ ప్రభుత్వం పూర్తి చేసుకున్న సంధర్భంగా నిర్వహించిన రైతు విజయోత్సవ సభలో సీఎం రేవంత్ రెడ్డి కీలక ప్రకటన చేశారు. రైతాంగం సన్న వడ్లను సాగు చేస్తే రూ. 500 లు అదనంగా ఇస్తామని ప్రకటించారు. అలాగే రైతులకు ప్రభుత్వం నగదు జమ చేసింది. ఆ తర్వాత రైతు భరోసా స్కీమ్ అమలుపై రైతన్నల్లో పలు అనుమానాలు వ్యక్తమయ్యాయి.
ఆ అనుమానాలను పటాపంచలు చేస్తూ తెలంగాణ ప్రభుత్వం ఈనెల 26 నుండి రైతు భరోసాను అమలు చేయనుంది. ఈ పథకాన్ని పక్కాగా అమలు చేసేందుకు కసరత్తు ప్రారంభమైంది. మంగళవారం రాష్ట్ర స్థాయి వ్యవసాయాధికారులు, సాంకేతిక కంపెనీల ప్రతినిధులతో మంత్రి తుమ్మల నాగేశ్వరరావు భేటీ అయ్యారు. ఈ భేటీలో మంత్రి పలు కీలక సూచనలు చేశారు. సాగుకు అనువుగాని భూములను సాంకేతిక సహాయంతో గుర్తించాలని ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. యాసంగి నుండి వ్యవసాయానికి అనువైన భూములన్నంటికి రైతుభరోసా వర్తించాలని కూడ భేటీలో నిర్ణయించారు.
వ్యవసాయ యోగ్యంకాని భూముల వర్గీకరణను సజావుగా నిర్వహించేలా, మండలాల, గ్రామాల వారిగా భూముల విస్తీర్ణాలు, సర్వే నెంబర్లను మంత్రి అడిగి తెలుసుకున్నారు. ప్రభుత్వం కూడా రెవిన్యూ, వ్యవసాయశాఖ అధికారులు, సిబ్బంది సేవలు వినియోగించుకొని, గ్రామాల వారిగా సర్వే చేసి వ్యవసాయ యోగ్యం కాని భూములను నిర్ధారించాలని మంత్రి తుది నిర్ణయం ప్రకటించారు. మొత్తం మీద అసలుసిసలైన రైతన్నలకు అన్యాయం జరగకుండ, రైతుభరోసా అందరికీ వర్తింప జేసేందుకు ప్రభుత్వం సన్నద్దమవుతోంది.