సకల హంగులతో స్టేట్ ఆఫ్ ఆర్ట్ టెక్నాలజీతో అధునాతనంగా నిర్మించిన చర్లపల్లి రైల్వే టెర్మినల్‌ను ఇవాళ ప్రధానమంత్రి నరేంద్ర మోదీ వర్చ్యువల్ విధానంలో ప్రారంభించారు. అనంతరం ప్రధానమంత్రి మాట్లాడుతూ.. ఎయిర్‌పోర్టును తలపించేలా చర్లపల్లి రైల్వే స్టేషన్ నిర్మాణం జరిగిందని, 413 కోట్ల వ్యయంతో చర్లపల్లి రైల్వే టెర్మినల్ పనులు చేపట్టడం జరిగిందన్నారు.
తెలంగాణ ప్రగతిలో చర్లపల్లి రైల్వే టెర్మినల్ అత్యంత కీలకం: ప్రధాని మోదీ
ఓఆర్ఆర్కు అత్యంత సమీపంలో చర్లపల్లి ఉందని, తెలంగాణ ప్రగతిలో ఇది అత్యంత కీలకంగా మారబోతోందని, సోలార్ స్టేషన్‌గా దీన్ని అభివృద్ధి చేశారని మోదీ వ్యాఖ్యానించారు. ఈజ్ ఆఫ్ డూయింగ్ బిజినెస్‌లో భాగంగా.. చర్లపల్లి లాంటి స్టేషన్లు ఎంతో అవసరమని, 2014లో కేవలం 5 నగరాల్లోనే మెట్రో ఉందని, పదేళ్లలో 21 నగరాలకు మెట్రో విస్తరించిందని ప్రధానమంత్రి మోదీ పేర్కొన్నారు.
తెలంగాణా రాష్ట్రానికి వర ప్రదాయిని చర్లపల్లి రైల్వేటెర్మినల్: కిషన్ రెడ్డి
ఇక ఈ కార్యక్రమంలో చర్లపల్లి రైల్వే టెర్మినల్ ప్రారంభోత్సవ కార్యక్రమంలో పాల్గొన్న కేంద్రమంత్రి జి.కిషన్ రెడ్డి మాట్లాడుతూ చర్లపల్లి రైల్వే టెర్మినల్ తెలంగాణ రాష్ట్రానికి వరప్రసాదం అని, ప్రజా రవాణా, వస్తు రవాణాకు ఈ టెర్మినకు ఎంతో ఉపయోగపడుతుందని తెలిపారు.మనదేశంలో1350 రైల్వే స్టేషన్లను అభివృద్ధి చేస్తున్నామన్నారు.సికింద్రాబాద్ రైల్వే స్టేషన్ కోసం 720 కోట్లు, నాంపల్లి రైల్వే స్టేషన్ కోసం 350 కోట్లు కేటాయించి అభివృద్ధి పరుస్తున్నామన్నారు..
తెలంగాణా రైల్వేపై కేంద్రం ఫోకస్ ఇలా
అమృత్ భారత్ కింద రాష్ట్రంలో 40 రైల్వే స్టేషన్లను అభివృద్ధి పరుస్తున్నామని తెలిపారు. రాష్ట్రంలో వంద శాతం రైల్వే విద్యుదీకరణ పూర్తయిందని ,రైల్వే ప్రమాదాల నివారణకు , కవచ్ పథకం అమలుచేస్తున్నామని, ఈ పథకాన్ని ప్రయోగాత్మకంగా లింగం పల్లి, వికారాబాద్, వాడి స్టేషన్లలో ముందు అమలు చేస్తున్నామని కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి తెలిపారు.
జాతీయ రహదారుల అభివృద్ధికి కేంద్రం లక్షల కోట్ల నిధులు
రాష్ట్రంలో జాతీయ రహదారుల అభివృద్ధి కోసం కూడా కేంద్ర నిధులు లక్షా ఇరవై కోట్ల నిధులు వెచ్చించామని, కాజీపేట రైల్వే మ్యాన్యుఫాక్చర్ యూనిట్ వేగంగా నిర్మాణం అవుతోందన్నారు. యాదగిరి గుట్ట దాకా ఎంఎంటీఎస్ పొడిగింపునకు స్థల సేకరణ కోసం రాష్ట్ర ప్రభుత్వం చర్యలు చేపట్టాలని కోరారు. తెలంగాణా ప్రగతికి కేంద్రం బాటలు వేస్తుందని, కీలక ప్రాజెక్ట్ లను ఇచ్చి తెలంగాణా నెత్తిన పాలు పోసిందని కిషన్ రెడ్డి వ్యాఖ్యానించారు.