కరోనా కష్ట కాలంలో విద్యార్థులకు ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి ఓ శుభవార్తను వినిపించారు. 2018-19 విద్యా సంవత్సరానికి సంబంధించి రూ.1800 కోట్లు ఫీజు రీయింబర్స్‌మెంట్ బకాయిలు చెల్లించామన్నారు. అంతేకాకుండా 2019-20 సంవత్సరానికి సంబంధించి మూడు త్రైమాసికాలకు కూడా ఫీజు రీయింబర్స్‌మెంట్ చెల్లించామని తెలిపారు. ఈ మేరకు మంగళవారం జిల్లా కలెక్టర్లు, ఎస్పీలతో నిర్వహించిన వీడియో కాన్ఫరెన్స్‌లో సీఎం జగన్ వెల్లడించారు. ఈ సమావేశంలో విద్యారంగానికి సంబంధించిన పలు కీలక విషయాలను ముఖ్యమంత్రి వైఎస్ జగన్ ప్రస్తావించారు. వచ్చే విద్యా సంవత్సరం నుంచి విద్యార్థుల తల్లి ఖాతాలోకే ఫీజు రియింబర్స్‌మెంట్ మొత్తాన్ని చెల్లిస్తాం పేర్కొన్నారు.
గతంలో ఇంజనీరింగ్ విద్యకు ఫీజు రీయింబర్స్‌మెంట్ పథకం కింద ప్రభుత్వం రూ.35వేలు మాత్రమే ఇచ్చేదని, మిగతా డబ్బును కాలేజీలు తల్లిదండ్రుల నుంచి వసూలు చేస్తున్నాయని అధికారులు సీఎంకు తెలిపారు. కానీ ప్రభుత్వం పూర్తిస్థాయి ఫీజు రీయింబర్స్‌మెంట్‌ను కాలేజీలకు ఇస్తోందని వివరించారు. తల్లిదండ్రుల నుంచి అదనంగా వసూలు చేసిన డబ్బును తిరిగి విద్యార్థుల తల్లిదండ్రులకే ఇచ్చేయాలని ఆదేశాలు జారీచేసినట్లు తెలిపారు. దీనికి సంబంధించి 191 కాలేజీలకు ఇప్పటికే ఆదేశాలు ఇచ్చామని, వాటిని సక్రమంగా అమలయ్యేలా చూడాలని కలెక్టర్లకు సూచించారు. ప్రభుత్వ ఆదేశాలను పాటించని కాలేజీలపై చర్యలు తీసుకుని, బ్లాక్ లిస్టులో పెడతామని విద్యాశాఖ అధికారులు స్పష్టం చేశారు.