Mehul Choksi Dominica High Court : పంజాబ్ నేషనల్ బ్యాంక్ కుంభకోణం నిందితుడు, వజ్రాల వ్యాపారి చోక్సీ.. . తాను చట్టాన్ని గౌరవించే వ్యక్తినని అఫిడవిట్‌లో పేర్కొన్నారు. అమెరికాలో చికిత్స కోసమే తాను ఇండియా విడిచిపెట్టానని, విచారణలో భాగంగా భారత్ అధికారులకు చోక్సీ ఆహ్వానం పలికారు. అధికారులు వచ్చి తనను ప్రశ్నించవచ్చని వెల్లడించడం విశేషం. విచారణకు సంబంధించి ఎలాంటి ప్రశ్నలకైనా సమాధానం ఇస్తానని స్పష్టం చేశారు. తాను ఏ చట్టాన్ని ఉల్లంఘించలేదని.. ఇండియా వదిలిపెట్టిన సమయంలో తనపై ఎలాంటి వారెంట్ లేదన్నారు చోక్సీ.
ఇప్పుడు రెడ్ కార్నర్ నోటిసు ఉందని.. అయితే అదేం ఇంటర్‌నేషనల్ అరెస్ట్ వారంట్ కాదన్నారు. చోక్సీని ఇండియాకు అప్పగించే అంశంపై డొమినికా హైకోర్టు విచారణ జరుపుతోంది. దీనికి సంబంధించి చోక్సీ 8 పేజీల అఫిడవిట్‌ను దాఖలు చేశారు. 2018, జనవరిలో పంజాబ్ నేషనల్ బ్యాంక్ స్కామ్ బయటపడే కంటే కొన్ని వారాలకు ముందే తన మేనల్లుడు నీరవ్ మోదీతో కలిసి దేశం వదిలి పారిపోయారు చోక్సీ. బ్యాంకు అధికారులకు లంచాలు ఇచ్చి వారి నుంచి హామీ పత్రాలు పొందడంతో పాటు విదేశీ బ్యాంకుల్లో లోన్లు తీసుకున్నట్లు ఇద్దరిపై ఆరోపణలు ఉన్నాయి.