పాలకుర్తి: తెలంగాణలో ముఖ్యమంత్రి కేసీఆర్ గారు అహర్నిశలు చేస్తున్న కృషి వల్ల రాష్ట్రంలో ప్రస్తుతము రోజువారి కరోనా పాజిటివ్ కేసుల సంఖ్య క్రమక్రమంగా తగ్గుతున్నదని,గ్రామీణాభివృద్ధి శాఖ మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావు అన్నారు. పాలకుర్తి అసెంబ్లీ నియోజకవర్గం లోని ప్రజాప్రతినిధులతో ఆయన టెలికాన్ఫరెన్స్ నిర్వహించారు. కరోనా వల్ల ప్రజా ప్రతినిధులు, కార్యకర్తలు, ఆత్మీయులు, బంధువులు ఇటీవల చనిపోవడం వల్ల హృదయం కలచివేసిందని, నిరంతరం తాను బాధపడుతున్నానని మంత్రి అన్నారు. దేశంలో మరెక్కడా లేని విధంగా కరోనా కట్టడి కోసం ఇంటింటికి తిరిగి ఆశా కార్యకర్తలు నిర్వహిస్తున్న జ్వర సర్వే సత్ఫలితాలను ఇస్తున్నదని మంత్రి తెలిపారు.
ఈ సర్వే నిర్వహిస్తున్నప్పుడు ఎవరికైనా జ్వరం, ఒళ్ళు నొప్పులు లాంటి లక్షణాలు ఉంటే మెడికల్ కిట్స్ ఇచ్చి, చికిత్స చేయడం జరుగుతున్నదని ఆయన అన్నారు. ప్రాథమిక ఆరోగ్య కేంద్రాల పరిధిలోని గ్రామాలలో పనిచేసే ఎఎన్ఎం, ఆశా వర్కర్ల వద్ద మెడికల్ కిట్లు అందుబాటులో ఉన్నాయని మంత్రి తెలిపారు.జ్వరం ఒళ్ళు నొప్పులు లాంటి లక్షణాలు ఉన్నవారు పాజిటివ్ టెస్టింగ్ కోసం ఎదురు చూడకుండా, వెంటనే మెడికల్ కిట్ లో ఉన్న మందులు వాడాలని, లక్షణాలు తగ్గనట్లయితే కరోనా టెస్టులు చేసుకొని ఒకవేళ పాజిటివ్ వచ్చినట్లయితే హోమ్ ఐసోలేషన్ లో ఉంటూ, డాక్టర్ల పర్యవేక్షణలో మందులు వాడాలని ఆయన కోరారు. ఒకవేళ హోం ఐసోలేషన్ లో చికిత్స పొందుతున్న రోగుల పరిస్థితి బాగుగా లేనట్లయితే మెరుగైన చికిత్స కోసం వరంగల్ లోని ఎంజిఎం ఆస్పత్రిలో చేర్పించాలని ఆయన కోరారు. రాష్ట్రంలో వైద్య ఆరోగ్య శాఖలో విప్లవాత్మకమైన మార్పులకు ముఖ్యమంత్రి కేసీఆర్ శ్రీకారం చుట్టారని మంత్రి తెలిపారు.
రాష్ట్ర ప్రజలకు మెరుగైన వైద్య సేవలు అందించేందుకు అన్ని రకాల వైద్య సేవలను ప్రజలకు రాష్ట్ర ప్రభుత్వం అందుబాటులోకి తీసుకొచ్చిందని ఆయన అన్నారు. కరోనా నిర్ధారణ పరీక్షలు, చికిత్సకోసం అవసరమైన ఇతర పరీక్షలకోసం పేదలు అవస్థలు పడుతున్న ప్రస్తుత పరిస్థితులలో, వైద్యం అందించడం అంటే కేవలం డాక్టర్లు, ఔషధాలు మాత్రమే కాదని, పరీక్షలు కూడా అత్యంత ప్రాధాన్యత అంశంగా ప్రభుత్వం భావించిందని, అందుకనుగుణంగా ఈనెల 9వ తేదీ నుండి 19 జిల్లా కేంద్రాలలో డయాగ్నొస్టిక్ కేంద్రాలను ప్రారంభించాలని ముఖ్యమంత్రి కేసీఆర్ నిర్ణయించారని ఆయన అన్నారు. అందులో భాగంగానే ఉమ్మడి వరంగల్ జిల్లాలోని జనగామ, ములుగు, మహబూబాబాద్ లో నున్న ప్రభుత్వ ఆసుపత్రులలో డయాగ్నొస్టిక్ కేంద్రాలను ఏర్పాటు చేయాలని ముఖ్యమంత్రి కేసీఆర్ నిర్ణయించినందులకు ఆయన ముఖ్యమంత్రికి కృతజ్ఞతలు తెలిపారు.