Kalbhonde Village ఓ వైపు మహారాష్ట్రలో కరోనా వైరస్ వ్యాప్తిని కట్టడి చేసేందుకు అధికారులు సతమతమవుతుంటే.. కరోనా హాట్ స్పాట్ గా మారిన ముంబైకి సమీపంలోని ఓ గ్రామం మాత్రం కట్టుదిట్టమైన చర్యలతో15 నెలలుగా తమ గ్రామంలో ఎవరికీ కరోనా సోకకుండా నివారించగలిగింది. ముంబైకి 70 కిలోమీటర్ల దూరంలోని థానే జిల్లాలోని కల్బోందే గ్రామంలో..గతేడాది మార్చిలో దేశవ్యాప్త లాక్ డౌన్ ప్రకటించినప్పటి నుంచి ఇప్పటివరకు ఒక్క కోవిడ్ కేసు కూడా నమోదుకాలేదని అధికారులు తెలిపారు. 1560 మంది నివసించే కల్బోందే గ్రామం.. ముంబై మెట్రొపాలిటన్ రీజియన్ (MMR) పరిధిలోనే ఉన్నా కరోనా వైరస్ ఈ గ్రామం దరిదాపుల్లోకి రాలేదు.
ఈ సందర్భంగా కల్బోందే గ్రామ సర్పంచ్ దేవకి ఎం ఘెరా మాట్లాడుతూ…కరోనా కట్టడికి5 తాము థానే జిల్లా అధికారులు ఇచ్చిన మార్గదర్శకాలను కఠినంగా అమలు చేయడంతో పాటు బయట ప్రపంచంతో తమ గ్రామానికి సంబంధాలు లేకుండా చూసుకున్నామని సర్పంచ్ తెలిపారు. 11 మందితో కూడిన గ్రామ విజిలెన్స్ కమిటీ కరోనా మహమ్మారి నుంచి గ్రామస్తులను కాపాడుకునేందుకు ఎప్పటికప్పుడు ప్రణాళికాబద్ధంగా పనిచేస్తోందని వెల్లడించారు. కరోనా ఫస్ట్, సెకండ్ వేవ్ లు వ్యాప్తి చెందినా తమ గ్రామంలో సున్నా కేసులు నమోదయ్యాయని, ఇదే స్ఫూర్తితో థర్డ్ వేవ్ కు సన్నద్ధమవుతున్నామని తెలిపారు.