పుష్ప2 చిత్రం విడుదల నేపథ్యంలో హైదరాబాద్ సంధ్య థియేటర్ వద్ద తొక్కిసలాట ఘటన, మహిళా ప్రేక్షకురాలు రేవతి మృతితో తలెత్తిన వివాదంతో ఉక్కిరిబిక్కిరవుతున్న హీరో అల్లు అర్జున్ కు మరో ఎదురుదెబ్బ తగిలింది. ఈ కేసుపై ఇప్పటికే తెలంగాణ పోలీసులు సీరియస్ గా దర్యాప్తు చేస్తున్నారు. త్వరలో తెలంగాణ హైకోర్టు ఇచ్చిన బెయిల్ ను రద్దు చేయమని కూడా పోలీసులు కోరబోతున్నట్లు ప్రచారం జరుగుతోంది. ఇలాంటి సమయంలో కాంగ్రెస్ ఎమ్మెల్సీ తీన్మార్ మల్లన్న ఆయనకు షాకిచ్చారు.
హీరో అల్లు అర్జున్‌పై ఇవాళ మేడిపల్లి పోలీసులకు కాంగ్రెస్ ఎమ్మెల్సీ తీన్మార్ మల్లన్న ఫిర్యాదు చేశారు. తన తాజా చిత్రం
పుష్ప 2లో పోలీస్ ఆఫీసర్ స్విమ్మింగ్ పూల్‌లో ఉండగా హీరో ఉచ్చ పోశాడని, ఈ సినిమాలో కొన్ని సీన్స్ పోలీసులను కించపరిచే విధంగా ఉన్నాయని మల్లన్న ఫిర్యాదులో పేర్కొన్నారు. ఇందుకు కారణమైన ఆ సినిమా హీరో అల్లు అర్జున్, డైరెక్టర్ సుకుమార్, నిర్మాతలపై చర్యలు తీసుకోవాలని మేడిపల్లి పోలీస్ స్టేషన్‌లో కాంగ్రెస్ ఎమ్మెల్సీ తీన్మార్ మల్లన్న ఫిర్యాదు చేశారు.
ఓవైపు అల్లు అర్జున్ తో తలెత్తిన వివాదానికి ఫుల్ స్టాప్ పెట్టే దిశగా కాంగ్రెస్ ప్రభుత్వం అడుగులు వేస్తుందనే సంకేతాలు అందుతున్నాయి. ఇవాళ కాంగ్రెస్ ఎంపీ చామల కిరణ్ కుమార్ రెడ్డి కూడా అల్లు అర్జున్ పై తమకు ఎలాంటి కోపం లేదని, ఈ వివాదాన్ని పొడిగించే ఉద్దేశం తమకు లేదని తేల్చిచెప్పేశారు. ఇలాంటి తరుణంలో అల్లు అర్జున్ తో పాటు పుష్ప 2 దర్శకుడు సుకుమార్, నిర్మాతలపై చర్యలు తీసుకోవాలని కోరుతూ ఎమ్మెల్సీ తీన్మార్ మల్లన్న ఫిర్యాదు చేయడం ప్రాధాన్యం సంతరించుకుంది. ఇప్పటికే సొంత పార్టీ ప్రభుత్వంతో పలు అంశాల్లో విభేదిస్తున్న మల్లన్న ఇచ్చిన ఫిర్యాదుపై పోలీసులు ఎలాంటి చర్యలు తీసుకుంటారో చూడాల్సి ఉంది.