తెలంగాణ ప్రభుత్వం కొత్త సంవత్సరం వేళ కీలక నిర్ణయాలు తీసుకుంటోంది. ఏడాది పాలన పూర్తి చేసుకున్న ప్రభుత్వం పాలనా పరంగా – రాజకీయంగా కొత్త ప్రణాళికలు సిద్దం చేస్తోంది. ఎన్నికల సమయంలో ఇచ్చిన హామీ మేరకు కొత్త రేషన్ కార్డుల జారీ పైన ఇప్పటికే ప్రభుత్వం విధాన పరం గా ప్రకటన చేసింది. కొత్తగా డిజిటల్ కార్డులు ఇవ్వాలని నిర్ణయించింది. అర్హత పైన నిర్ణయం తీసుకుంది. ఇక, ఇప్పుడు కొత్త రేషన్ కార్డుల కోసం దరఖాస్తుల స్వీకరణ.. జారీ పైన తాజాగా కీలక అప్డేట్ ఇచ్చింది.
తెలంగాణలో అర్హులైన పేదలకు కొత్త రేషన్ కార్డుల జారీ దిశగా ప్రభుత్వం కసరత్తు వేగవంతం చేసింది. ఇందు కోసం మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి ఇప్పటికే ప్రకటన చేసారు. కొత్తగా చిప్ తో ఉన్న డిజిటల్ కార్డులో పూర్తిగా లబ్దిదారుల సమాచారం తో కార్డులు మంజూరు చేయాలని ప్రభుత్వం నిర్ణయించింది. ఇందు కోసం పౌర సరఫరాల శాఖ కీలక నిర్ణయం తీసుకుంది. కొత్తగా రేషన్ కార్డుల కోసం సంక్రాంతి నుంచి దరఖాస్తులు స్వీకరించాలని డిసైడ్ అయింది. ఇందులో భాగంగా మార్గదర్శకాలను మార్పు చేస్తోంది. ఆదాయ పరిమితిని పెంచే ఆలోచనతో ఉంది.
ఇందు కోసం ఇతర రాష్ట్రాల్లో ఉన్న ఆదాయ పరిమితి ని తెలంగాణ అధికారులు అధ్యయనం చేసారు. వచ్చే వారం జరిగే మంత్రివర్గ సమావేశంలో కొత్త రేషన్ కార్డుల జారీకి సంబంధించి మార్గ దర్శకాలను ఖరారు చేయనున్నారు. అందులో భాగంగా ఇప్పటి వరకు గ్రామీణ ప్రాంతాల్లో రూ 1.50 లక్షలు, పట్టణాల్లో రూ 2 లక్షలుగా ఉన్న ఆదాయ పరిమితి కొంత మేర పెరగనుంది. ఇక, రాష్ట్రంలో ప్రస్తుతం దాదాపు 10 లక్షల రేషన్ కార్డులు ఉన్నాయి. ఇందుకు గాను 2.82 కోట్ల మంది లబ్ది దారులు ఉన్నట్లు ప్రభుత్వ లెక్కలు స్పష్టం చేస్తున్నాయి.
ప్రభుత్వం నిర్వహించిన ప్రజా పాలనలో కొత్త రేషన్ కార్డుల కోసం దాదాపుగా 10 లక్షల మంది దరఖాస్తు చేసుకున్నారు. అందులో లబ్ది దారుల సంఖ్య 32 లక్షలుగా గుర్తించారు. దీంతో, వీరికి మొత్తంగా కార్డులు మంజూరు చేస్తే లబ్ధిదారుల సంఖ్య 3.4 కోట్లకు చేరుతుంది. దీంతో, కొత్త కార్డుల జారీ పైన మంత్రివర్గ సమావేశంలో చర్చించి అధికారికంగా ఆదాయ పరిమితి .. అర్హతలు, మార్గదర్శకాలు ప్రకటించనున్నారు. అదే విధంగా కొత్త జంటలకూ రేషన్ కార్డులు ఇవ్వాలని నిర్ణయించారు. సంక్రాంతి నుంచి కొత్త రేషన్ కార్డుల ప్రక్రియ ప్రారంభించి.. ఆ వెంటనే మంజూరు చేసేలా ప్రభుత్వం కార్యాచరణ సిద్దం చేస్తోంది.