ఏపీతో పాటు పలు రాష్ట్రాల్లో ఉన్న ఎస్సీ కోటా వర్గీకరణ డిమాండ్ పై సుదీర్ఘంగా విచారించిన సుప్రీంకోర్టు ధర్మాసనం ఈ ఏడాది కీలక తీర్పు ఇచ్చింది. ఎస్సీ వర్గీకరణను సమర్ధిస్తూ సుప్రీంకోర్టు ఇచ్చిన ఈ తీర్పును అమలు చేసే విషయంలో ప్రభుత్వాలు ఇంకా తడబడుతున్నాయి. ముఖ్యంగా గతంలో ఎస్సీ వర్గీకరణకు మద్దతుగా నిలిచిన చంద్రబాబు వంటి నేతలు కూడా తమ రాష్ట్రాల్లో ఇంకా సుప్రీంకోర్టు తీర్పు అమలుకు ఆలోచిస్తున్నాయి. ఇలాంటి తరుణంలో ఏపీ సర్కార్ కీలక నిర్ణయం తీసుకుంది.
ఎస్సీ వర్గీకరణపై సుప్రీంకోర్టు ఇచ్చిన తీర్పును అధ్యయనం చేసి ప్రభుత్వానికి సూచనలు, సలహాలు ఇచ్చేందుకు వీలుగా ఏపీ ప్రభుత్వం ఇవాళ రిటైర్డ్ ఐఏఎస్ రాజీవ్ రంజన్ మిశ్రా నేతృత్వంలో ఏక వ్యక్తి కమిషన్ ను నియమించింది. ఈ నెల 27 నుంచి నాలుగు రోజుల పాటు ఈ కమిషన్ ఛైర్మన్ రాజీవ్ రంజన్ మిశ్రా ఏలూరు, కృష్ణా, గుంటూరు జిల్లాల్లో పర్యటిస్తారని ప్రభుత్వం ఓ ప్రకటనలో తెలిపింది. ఆయా జిల్లాలతో పాటు గతంలో ఉన్న ఉమ్మడి జిల్లా కేంద్రాల్లో ఆయన నేరుగా విజ్ఞప్తులు, అభ్యంతరాలు స్వీకరిస్తారని పేర్కొంది.
అలాగే విజయవాడ మెగల్రాజపురంలోని గిరిజన సంక్షేమశాఖ ప్రధాన కార్యాలయంలోనూ ఎస్సీ వర్గీకరణపై కమిషన్ అభ్యంతరాలు స్వీకరిస్తుందని ప్రభుత్వం తెలిపింది. పని వేళలైన ఉదయం 10 గంటల నుంచి సాయంత్రం 5 గంటల 30 నిమిషాల వరకూ కమిషన్ కు విజ్ఞప్తులు నేరుగా కానీ, omcscsubclassification@gmail.com ద్వారా కూడా జనవరి 9 వరకూ సమర్పించవచ్చని ప్రభుత్వం తెలిపింది. అనంతరం కమిషన్ దీనిపై ఆధ్యయనం చేసి ప్రభుత్వానికి నివేదిక ఇస్తుంది. దాని ఆధారంగా ప్రభుత్వం ఎస్సీ వర్ఘీకరణను అమలు చేయనుంది.