ఎన్నికల నిబంధనల్లో కేంద్ర ప్రభుత్వం మార్పులు చేసింది. 1961 చట్టం ఎన్నికల నియమాలు.. నెంబర్ 93 (2) (a)లో ఎన్నికల కమిషన్ చేసిన సూచనలను కేంద్ర ప్రభుత్వంలోని న్యాయ శాఖ అమోదించింది. ఈ మార్పులు ప్రకారం.. ఇకపై ఎన్నికలకు సంబంధించిన పేపర్లు, లేదా ఎలక్ట్రానిక్ రికార్డులను తనిఖీ చేసేందుకు ఎవరినీ అనుమతించరు. ఈ నిబంధన ప్రకారం.. ఎన్నికలకు సంబంధించిన అభ్యర్థుల సిసిటివి కెమెరా వీడియోలు, వెబ్ కాస్టింగ్ ఫుటేజ్ తనిఖీ చేయడంపై నిషేధం విధించారు. అయితే ఈ మార్పులు చేయడంతో ఎన్నికల్లో పారదర్శకత లేకుండా పోయిందని కాంగ్రెస్ మండిపడింది.
కానీ కేంద్ర ప్రభుత్వం మాత్రం ఒక కోర్టు కేసు కారణమని తెలిపింది. ఈసీ మాత్రం మరో వివరణ ఇచ్చింది. పోలింగ్ బూత్ లో సిసిటీవి కెమెరాల తనిఖీ వల్ల ఓటర్ల గోప్యతకు భంగం కలుగుతోందని.. ఈ కారణంగానే నిషేధం విధించామని ఎన్నికల కమిషన్ వెల్లడించింది.
నియమాల్లో మార్పుల చేయడాన్ని కాంగ్రెస్ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గే తప్పుబట్టారు. ఎన్నికల్లో పారదర్శకత లేకుండా చేయడానికే ఈ నిబంధనల్లో మార్పులు చేశారని ఆయన ఆరోపించారు. ఎన్నికల రికార్డులు, సీసిటీవిల వీడియోలు తనిఖీ చేయకుండా నిషేధించడంలో ఎన్నికల కమిషన్ విశ్వసనీయత కోల్పోయిందని పేర్కొన్నారు. కేంద్రంలోని నరేంద్ర మోడీ ప్రభుత్వం ఆచితూచి క్రమంగా ఎన్నికల కమిషన్ విశ్వసనీయతని నాశనం చేసిందని మండిపడ్డారు.
ఎన్నికల కమిషన్ నిజాయితీని దెబ్బతీయడమంటే రాజ్యాంగంపై, ప్రజాస్వామ్యంపై నేరుగా దాడి చేయడమేనని వ్యాఖ్యానిస్తూ ఎక్స్ లో ఖర్గే ఓ పోస్ట్ చేశారు. “ఎన్నికలు నిర్వహించే ప్రక్రియలో నియమాల సవరణ చేయడంతో మోడీ ప్రభుత్వం కుట్రపూరితంగా ఎన్నికల కమిషన్ విశ్వసనీయతను దెబ్బతీసిందని స్పష్టమవుతోంది. ఇంతకుముందు వారు ఎన్నికల కమిషనర్ ఎన్నిక కమిటీ నుంచి సుప్రీం కోర్టు ప్రధాన న్యాయమూర్తిని తొలగించారు. ఇప్పుడు ఏకంగా ఎన్నికల సంబంధించి ఆధారాలు బయటపెట్టకూడదని నిబంధనలు చేశారు. ఇలా చేయకూడదని హై కోర్టు చెప్పినా వారు చేశారు.
ఎన్నికల్లో అవతవకలు జరుగుతున్నాయని, ఓటర్ లిస్టులో పేర్లు డెలీట్ చేస్తున్నారని, ఈవిఎంలో మోసం జరిగిందని ఎన్నిసార్లు ఈసీకి కాంగ్రెస్ ఫిర్యాదులు చేసినా.. ఎన్నికల కమిషనర్ లేదా ఆఫీసర్లు అసలు పట్టించుకోలేదు. మేము ఎన్ని లేఖలు రాసినా స్పందించలేదు. ఎన్నికల కమిషన్ ఒక స్వతంత్ర యంత్రాంగమైనప్పటికీ ఈ మార్పులు చూస్తుంటే దాన్ని కేంద్రం నడుపుతున్నట్లే స్పష్టమవుతోంది. మేము దీన్ని అడ్డుకుంటాం.” అని ఖర్గే చెప్పారు.
చట్టపరమైన చర్యలు తీసుకుంటాం.. కోర్టులో ఈసీ మార్పులను సవాల్ చేస్తాం.
కాంగ్రెస్ జెనెరల్ సెక్రటరీ ఇన్ చార్జి జై రామ్ రమేష్ మాట్లాడుతూ.. ఎన్నికల నిబంధనల్లో మార్పులకు వ్యతిరేకంగా చట్టపరంగా కోర్టులో సవాల్ చేస్తామని చెప్పారు. కాంగ్రస్ జెనెరల్ సెక్రటరీ కెసి వేణు గోపాల్ కూడా ఈసీ ప్రభుత్వానికి అనుకూలంగా వ్యవహరించడానికే తీర్మానించుకుందని.. ఎన్నికల్లో పారదర్శకత లేకుండా చేయడం రాజ్యాంగ ప్రకారం కుదరదని అన్నారు. ఎన్నికల రూల్ 93 ప్రకారం.. ఎన్నికలకు సంబంధించిన అన్ని దస్తావేజులు బహిరంగంగా తనిఖీల కోసం ఇవ్వాల్సిందేనని చెప్పారు.