మంచు అన్నదమ్ముల మధ్య మరోసారి ఆస్తితగాదాలు రేగాయి. ఇప్పుడిప్పుడే కొద్దికొద్దిగా చల్లబడుతున్నాడు అనుకున్న మనోజ్ మరోసారి రేగాడు. అన్న విష్ణుపై మరోసారి పోలీస్ స్టేషన్ లో కేసు పెట్టాడు. తాజాగా మనోజ్.. పహాడ్ శరీఫ్ పోలీస్ స్టేషన్ లో మంచు విష్ణుపై కేసు నమోదు చేసాడు. విష్ణుపైనే కాకుండా వినయ్ అనే వ్యక్తిపై కూడా ఫిర్యాదు చేశాడు.
అన్న మంచు విష్ణు నుంచి తనకు ప్రాణహాని ఉందంటూ 7 పేజీల ఫిర్యాదు కాపీను పోలీసులకు అందించాడు. ఏడు అంశాల మీద విష్ణుపై మనోజ్ ఫిర్యాదు చేశాడు. దీంతో మరోసారి మంచి ఫ్యామిలీ మ్యాటర్ సోషల్ మీడియాలో వైరల్ గా మారింది.
గత కొన్నిరోజులుగా మంచు బ్రదర్స్ మధ్య ఆస్తి తగాదాలు నడుస్తున్న విషయం తెల్సిందే. ఈ తగాదాల నడుమ మోహన్ బాబు – మనోజ్ మధ్య గొడవ జరిగి ఒకరిని ఒకరు తోసుకున్నారు. దీంతో మోహన్ బాబు.. మనోజ్ పైన.. మనోజ్, మోహన్ బాబుపైన కేసు పెట్టడంతో ఈ వివాదం బయటపడింది. ఆ తరువాత మంచు విష్ణు అమెరికా నుంచి వచ్చి.. తండ్రిని సముదాయించి ఆ కేసును వాపస్ తీసుకున్నాడు. ఇక విష్ణు.. ఇది మా కుటుంబ సమస్య .. మేము పరిష్కరించుకుంటామని చెప్పాడు. మోహన్ బాబు సైతం అన్నదమ్ముల మధ్య చిన్న గొడవ..త్వరలోనే పరిష్కారం అవుతుందని చెప్పుకొచ్చాడు.
ఇక్కడితో మంచు కుటుంబం మధ్య సమస్య తీరుతుంది అనుకున్నారు. కానీ, మనోజ్ కూతురును మోహన్ బాబు ఇంట్లో పెట్టుకొని.. అతడిని బయటకు గెంటేశాడు. అంతేకాకుండా వినయ్ అనే వ్యక్తితో మనోజ్ ఇంటివారిపై దాడి చేయించాడు. ఇందుకు సంబంధించిన వీడియోలు కూడా బయటపడ్డాయి. దీంతో మనోజ్.. తండ్రి, అన్న మీద పోలీసులకు ఫిర్యాదు చేశాడు. తన కూతురును తనకు ఇవ్వాలని ఇంటి ముందు రచ్చ రచ్చ చేశాడు.
ఇక ఈ గొడవల నేపథ్యంలోనే మోహన్ బాబు.. జర్నలిస్ట్ పై మైక్ ను విసరడం, అది అతనికి బలంగా తాకడంతో కేసు అయ్యింది. దీంతో మోహన్ బాబు వారికి క్షమాపణ చెప్పాలని జర్నలిస్టులు డిమాండ్ చేశారు. అనంతరం ఆయన సదురు బాధితుడికి క్షమాపణలు కూడా చెప్పాడు. ఇక జైలుకు వెళ్లకుండా బెయిల్ కు కూడా అప్లై చేశాడు. కానీ, కోర్టు మాత్రం బెయిల్ కు అంగీకరించలేదు.
ఇంకోపక్క మంచు విష్ణు నుంచి తనకు ప్రాణహాని ఉందని మనోజ్ మొదటి నుంచి చెప్పుకొస్తున్నాడు. మొన్నటికి మొన్న మనోజ్ తల్లి నిర్మలా దేవి పుట్టినరోజున విష్ చేయడానికి ఇంటికి వెళ్లి జనరేటర్ లో పంచదార వేసాడని, పవర్ పోయి ప్రాణాల మీదకు వచ్చిందనిమనోజ్ ఫిర్యాదులో తెలిపాడు. ఇక దీని తరువాత మనోజ్ కూతురు తనవద్దకు చేరడంతో సైలెంట్ గా ఉన్న అతను.. ఇప్పుడు మరోసారి విష్ణుపై కేసు పెట్టడం సంచలనంగా మారింది. మరి ఈ కేసుపై పోలీసులు ఎలాంటి విచారణ చేపట్టనున్నారు అనేది తెలియాల్సి ఉంది.