అల్లూరి సీతారామరాజు జిల్లాలో ఇటీవల డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ పర్యటించారు. అయితే పవన్ పర్యటన సాగినంతసేపు, అక్కడి గిరిజనులు తమ సమస్యలు ఇక పరిష్కారమేనన్న ధీమాను వ్యక్తం చేశారు. పవన్ పర్యటన ముగిసింది. ఆ తర్వాత ఏం జరిగింది?
ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ కూటమి ప్రభుత్వం ఏర్పడిన అనంతరం తొలిసారిగా అల్లూరి సీతారామరాజు జిల్లాలో పర్యటించారు. ఇప్పటివరకు ఏ మంత్రి కూడా పర్యటించని గ్రామాలలో పవన్ కాలినడక ద్వారా వెళ్లి, అక్కడి ప్రజలు ఎదుర్కొంటున్న సమస్యలను అడిగి తెలుసుకున్నారు. అంతేకాదు జోరు వర్షం సాగుతున్నప్పటికీ తన పర్యటన మాత్రం యధావిధిగా కొనసాగించారు పవన్ కళ్యాణ్. అక్కడ ఎవరి నోట విన్నా, మా సమస్య ఎంత రహదారి లేకపోవడమే, డోలి మోతలు తమకు తప్పడం లేదని గిరిజనులు ఆవేదన వ్యక్తం చేశారు. ఇక పవన్ తన పర్యటన ముగించుకుని వచ్చే క్రమంలో మీ సమస్యలు తప్పనిసరిగా పరిష్కరిస్తానంటూ హామీ ఇచ్చి వచ్చారు.
ఎవరో వస్తారు ఏదో చేస్తారని ఎదురుచూపుల్లో ఉన్న గిరిజనుల కోసం పవన్ అయితే వచ్చారు కానీ, హామీ నిలబెట్టుకుంటారా లేదా అన్నది వారి మదిలోని ప్రశ్న. ఇచ్చిన మాట తప్పక నెరవేర్చే నైజం గల డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్, అక్కడి నుండి వెనుదిరగడం తోటే పనులు ప్రారంభం కావాలని సంబంధిత అధికారులకు ఆదేశాలు జారీ చేశారు. అరకు వ్యాలీ మండలం చినలబుడు, పద్మాపురం గ్రామా పంచాయతీలలో పక్కనకుడి, మంజాగూడ, తుడుము, మాలివలస, రణజిల్లేడ గ్రామాలకు ఇప్పటి వరకు ఎలాంటి రోడ్డు సౌకర్యం లేకపోవడంతో వెంటనే ఆ పనులను పూర్తి చేసేలా అధికారులు చర్యలు చేపట్టారు.
ఉపాధి హామీ నిధులతో, హట్టగూడ గ్రామం నుండి 2.70 కిలోమీటర్లు మేర, రూ 552.00 లక్షల అంచనాతో తారురోడ్డును, పంచాయతీ రాజ్ ఇంజనీరింగ్ విభాగం ద్వారా చకచకా నిర్మించారు. ఈ రహదారి నిర్మాణం ద్వారా 1,736 జనాభా కలిగిన గిరిజన గ్రామాలకు రాకపోకలు సులభతరం కానున్నాయి. అంతేకాదు పర్యాటకంగా అభివృద్ధి చెందుతున్న రణజిల్లేడ వాటర్ ఫాల్స్ కు మార్గంగా ఉండటం వలన ఆ చుట్టుప్రక్కల గ్రామాలకు ప్రత్యక్షంగా, పరోక్షంగా ఉపాధి అవకాశాలు పెరిగి అవకాశం కూడా ఉంది. మొన్నటి వరకు డోలీ మోతలే తెలిసిన ఆ గ్రామాలు నేడు నూతన రహదారి చూసి మురిసిపోతున్నాయట. మొత్తం మీద పవన్ పర్యటన తర్వాత ఇంకా మరెన్ని అభివృద్ది పనులు అక్కడ వేగంగా సాగుతున్నాయని గ్రామస్తులు తెలుపుతున్నారు.