దేశంలో తీవ్రమవుతున్న ‘మసీదు కింద దేవాలయం’ వివాదాల పై రాష్ట్రీయ స్వయం సేవక్ సంఘ్ (ఆర్ఎస్ఎస్) అధ్యక్షుడు మోహన్ భాగవత్ స్పందించారు. మతం పేరుతో అనవసరంగా వివాదాలు చేయడం, ఇతర మతాల దైవాలను, వారి సంస్కృతిని అమమానించడం, కించపరచడం హిందూ సంప్రదాయం కాదని మోహన్ భాగవత్ అన్నారు. దేశంలో ఇటీవలి కాలంలో అయోధ్య రామ మందిరం తరహా వివాదాలు చేయడాన్ని ఖండించారు. దేశంలో ప్రతి ఒక్కరు తమకు ఇష్టమైన దైవాన్ని ఆరాధించడం, వారి దైవాన్ని పూజించడానికి హక్కు ఉందని ఆయన స్పష్టం చేశారు.
అయోధ్య రామ మందిరం హిందువుల ఆత్మగౌరవానికి సంబంధించిన విషయమని, ఆ మందిరం నిర్మించడం హిందువుల నమ్మకానికి ప్రతీక అన్ని ఉదహరిస్తూ.. ఇలాంటిదే ప్రతి చోట చేయడం వల్ల సమాజంలో ద్వేషం, శత్రుత్వ భావాలు పెరుగుతాయని.. అందుకే ఇలాంటి ఘటనలు ఏమాత్రం అమోదించకూడదని భాగవత్ అన్నారు.
మహారాష్ట్రలోని పుణెలోఆయన విశ్వగురు భారత్ అనే అంశంపై ఆయన ప్రసంగం చేశారు. ఆ ప్రసంగంలో భాగంగా ఆరాధనా స్థలాల గురించి కొత్త వివాదాలు రేకెత్తడంపై ఆయన మాట్లాడారు. ఉత్తర్ ప్రదేశ్ సంభల్ జిల్లాలోని షాషి జామా మసీదు, రాజస్థాన్ లోని అజ్మేర్ షరీఫ్ దర్గాల వివాదాలను తప్పుబట్టారు.
భారతదేశంలో విభిన్న మతాలకు చెందినవారు కలిసిమెలిసి శాంతియుతంగా జీవిస్తున్నారని.. ఇదే మన దేశానికి అసలైన గుర్తింపు అని వ్యాఖ్యానించారు.
చరిత్రలో జరిగిన తప్పిదాల నుంచి అందరూ నేర్చుకోవాలి
భారతీయులందరూ తమ గతంలో, దేశ చరిత్రలో జరిగిన తప్పులను గుర్తించి తెలుసుకొని వాటి నుంచి ఎంతో నేర్చుకోవాలని భాగవత్ సూచించారు. తప్పులను సరిదిద్దుకోవడం మళ్లీ వాటిని చేయకుండా జాగ్రత్తపడితే.. ప్రపంచానికే మన దేశం ఆదర్శంగా మారుతుందన్నారు. విభేదాలు మరిచి అన్ని మతాలను కలుపుకొని ముందుకు సాగడం అందుకు చాలా అవసరమన్నారు.
“అతివాదం, బలప్రయోగం, ఇతర మతాల దైవాలను అవమానించడం మన సంస్కృతి కాదు. ఇక్కడ మెజారిటీ, మైనారిటీ అనే విభేదాలు రాకూడదు. ప్రపంచ శాంతి కోసం భారత దేశం చాలా పెద్దపెద్ద ప్రకటనలు చేస్తోంది. అయినా యుద్ధాలు ఆగడం లేదు. అలాంటిది మన దేశంలో మైనారిటీలను అణచివేసే ఘటనల గురించి తరుచూ వింటున్నాం. మన దేశంలో కంటే ఇతర దేశాల్లో మైనారిటీల పరస్థితి ఎంత దారుణంగా ఉందో చూస్తూనే ఉన్నాం.” అని పరోక్షంగా బంగ్లాదేశ్ లో హిందువులపై జరిగే దాడులను ఆయన ప్రస్తావించారు.