ఫార్ములా ఈ కార్ రేస్ కేసుకు సంబంధించి హైకోర్టులో కేటీఆర్ కు బిగ్ షాక్ తగిలింది. ఇటీవల కేసుకు సంబంధించి ఏసీబీ ఎఫ్ఐఆర్ నమోదు చేసిన నేపథ్యంలో, ఏ వన్ గా మాజీ మంత్రి కేటీఆర్ పేరును ఏసీబీ పేర్కొంది. అయితే ఈ కేసుకు సంబంధించి ఎఫ్ఐఆర్ ను కొట్టేయాలని కోరుతూ, హైకోర్టులో క్వాష్ పిటిషన్ వేశారు కేటీఆర్.
శుక్రవారం హైకోర్టులో ఈ పిటిషన్ పై విచారణ సాగింది. ప్రభుత్వం తరఫున ఏజీ సుదర్శన్ రెడ్డి, కేటీఆర్ తరఫున సుప్రీంకోర్టు న్యాయవాది ఆర్యమ సుందరంలు వాదనలు వినిపించారు. ఇరుపక్షాల వాదనలు పూర్తి కాగా, న్యాయస్థానం తీర్పు వెల్లడించింది. పది రోజులపాటు కేటీఆర్ ను అరెస్టు చేయవద్దని ప్రకటించిన న్యాయస్థానం, విచారణ కొనసాగించాలని ఆదేశించింది. అలాగే తదుపరి విచారణను ఈనెల 27వ తేదీకి వాయిదా పడింది. 27వ తేదీలోగా ప్రతివాదులను కౌంటర్ దాఖలు చేయాలని న్యాయస్థానం ఆదేశించింది. అంతేకాకుండా కేటీఆర్ విచారణకు పూర్తి స్థాయిలో సహకరించాలని కూడా హైకోర్టు తీర్పునిచ్చింది.