విజయసాయిరెడ్డికి ఈడీ నోటీసులు..

కాకినాడ సీ పోర్టు, సెజ్‌ల వాటాల కేసు వ్యవహారం వైసీపీ నేతలను ఉక్కిరిబిక్కిరి చేస్తోంది. ఇప్పటికే సీఐడీ దర్యాప్తు చేస్తోంది. దాని ఎఫ్ఐఆర్ ఆధారంగా రంగంలోకి దిగేసింది ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరెక్టరేట్.

 

ఈ కేసులో నిందితులుగా భావిస్తున్న వైవీ విక్రాంత్ రెడ్డి, ఎంపీ విజయసాయిరెడ్డి, శరత్ చంద్రారెడ్డి, పీకెఎప్ శ్రీధర్ అండ్ సంతానం ఎల్ఎల్ పీ ప్రతినిధులకు ఈడీ నోటీసులు జారీ చేసింది. ఈ విషయం ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. ఆ నోటీసులకు సంబంధిత నిందితులు జవాబులు కూడా ఇచ్చారట.

 

పార్లమెంటు సమావేశాలు ఉండడం వల్ల తాను రావడం లేదని ఎంపీ విజయసాయిరెడ్డి రిప్లై ఇచ్చినట్టు సమాచారం. అనారోగ్యం కారణంగా ప్రస్తుతం రాలేనని విక్రాంత్ రెడ్డి సమాధానం ఇచ్చారు. ప్రస్తుతం విచారణకు రావడం కష్టమని, మరోసారి వస్తానని శరత్ చంద్రరెడ్డి జవాబు ఇచ్చారట. నోటీసులు అందుకున్న నిందితులు ఏదో కుంటి సాకు చెబుతూ ఈడీ విచారణకు గైర్హాజరు అయ్యారు.

 

ఈ నేపథ్యంలో వీరందరికీ మరోసారి నోటీసులు ఇవ్వాలని భావిస్తోందట ఈడీ. కేవీ రావు నుంచి లబ్దిదారైన అరబిందో రియాల్టీ అండ్ ఇన్‌ఫ్రా కంపెనీ డైరెక్టర్లకు నోటీసులు ఇచ్చేందుకు రెడీ అవుతోందని తెలుస్తోంది. వేల కోట్ల రూపాయలు విలువ చేసే వాటాలను బెదిరింపులకు పాల్పడి బదలాయించుకున్నారని కేవీ రావు తన ఫిర్యాదులో ప్రస్తావించారు.

 

కాకినాడ సీ పోర్టుకు సంబంధించి 2500 కోట్ల రూపాయలు విలువ చేసే వాటాను కేవలం 494 కోట్లు, అలాగే సెజ్‌లోని 1100 కోట్లకు పైగా విలువ చేసే వాటాలను కేవలం 12 కోట్లకు అరబిందో సంస్థకు దక్కించుకునేది ప్రధాన సారాంశం. అయితే ఈ వ్యవహారం మనీలాండరింగ్ కు సంబంధించినది కావడంతో ఈడీ ఫోకస్ చేసిన విషయం తెల్సిందే.

 

శుక్రవారంతో పార్లమెంటు సమావేశాలు పూర్తి కానున్నాయి. ఈ నేపథ్యంలో ఎంపీ విజయసాయిరెడ్డి విచారణకు హాజరవుతారా? లేదా అనేది ఆసక్తికరంగా మారింది. వీఎస్ఆర్ హాజరైతే హాజరవ్వాలనే ఆలోచనలో మిగతా నిందితులు ఉన్నట్లు తెలుస్తోంది. అప్పటికీ నిందితులు దేనికీ రియాక్ట్ కాకపోతే అరెస్టు ఖాయమనే ప్రచారం లేకపోలేదు.

 

ఇన్నాళ్లు గుట్టుగా సాగిన కాకినాడ పోర్టు వ్యవహారం వెలుగులోకి రావడంతో ఏం చెయ్యాలో దిక్కుతోచని స్థితిలో పడ్డారట ఆయా నిందితులు. సీఐడీ విచారణలో కొత్త విషయాలు బయటపడితే ఈ కేసు ఇంకెన్ని మలుపులు తిరుగుతుందో చూడాలి.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *