పార్లమెంట్ శీతాకాల సమావేశాల్లో అనూహ్య పరిణామాలు చోటు చేసుకుంటున్నాయి. నిన్న రాజ్యాంగ నిర్మాత డాక్టర్ బీఆర్ అంబేద్కర్ ను అవమానించే విధంగా కేంద్ర హోంమంత్రి అమిత్ షా చేసిన వ్యాఖ్యలు ఇందుకు కారణమయ్యాయి. అమిత్ షా వ్యాఖ్యల్ని నిరసిస్తూ ఆయన తన పదవికి రాజీనామా చేయాలని కోరుతూ విపక్షాలు ఆందోళన చేపట్టాయి. పార్లమెంట్ ప్రాంగణంలోని అంబేద్కర్ విగ్రహం వద్ద నిరసన తెలిపాయి. దీంతో ఎన్డీయే ఎంపీలు ప్రతిగా నిరసనకు దిగారు.
ఇవాళ తెల్లవారు జామున పార్లమెంట్ ప్రాంగణంలో డాక్టర్ బిఆర్ అంబేద్కర్‌పై అమిత్ షా వ్యాఖ్యలకు అనుకూలంగా, వ్యతిరేకంగా ఎన్డీయే, ఇండియా కూటమి ఎంపీలు నిరసనలు చేపట్టారు. రాజ్యసభలో బాబాసాహెబ్ అంబేద్కర్‌పై చేసిన వ్యాఖ్యలపై కేంద్ర హోంమంత్రి అమిత్ షా క్షమాపణలు చెప్పాలని, రాజీనామా చేయాలని ఇండియా కూటమి ఎంపీలు డిమాండ్ చేశారు. అయితే బాబాసాహెబ్ అంబేద్కర్‌ను కాంగ్రెస్ పార్టీ అవమానించిందని బీజేపీ ఎంపీలు ఆరోపిస్తున్నారు.
ఇవాళ ఉదయం పార్లమెంట్ గేటు బయట నిరసనకు దిగిన రాహుల్ గాంధీని బీజేపీ ఎంపీలు అడ్డుకున్నారు. రాజ్యసభలో విపక్ష నేత మల్లిఖార్జున ఖార్గేతో కలిసి ఆయన ఆందోళనకు దిగడంతో బీజేపీ ఎంపీలు వీరిని లోపలికి రానివ్వలేదు. ఈ క్రమంలో బీజేపీ ప్రతాప్ సారంగి కింద పడిపోయారు. గాయపడ్డ ఆయన్ను ఆస్పత్రికి తరలించారు. రాహుల్ గాంధీ తనను నెట్టేశారంటూ ప్రతాప్ సారంగి చేసిన ఆరోపణలపై ఆయన తీవ్రంగా స్పందించారు.
నిజానికి, బీజేపీ ఎంపీల బృందం తనను తరిమికొట్టి బెదిరింపులకు పాల్పడిందని, కాంగ్రెస్ అధినేత మల్లికార్జున్ ఖర్గేను కూడా బెదిరించారని రాహుల్ గాంధీ ఆరోపించారు. తాను నేను లోపలికి వెళ్లేందుకు ప్రయత్నిస్తున్నప్పుడు బీజేపీ ఎంపీలు తనను అడ్డుకునేందుకు ప్రయత్నించారని, దూరంగా నెట్టివేసి బెదిరించారని రాహుల్ తెలిపారు. పార్లమెంట్ లోకి వెళ్లే హక్కు తనకు ఉందన్నారు. అటు కాంగ్రెస్ ఎంపీ ప్రియాంక గాంధీ కూడా తనను బీజేపీ ఎంపీలు అడ్డుకున్న వీడియోల్ని షేర్ చేశారు.